PM Narendra Modi: మయన్మార్ కు మరింత సాయం చేసేందుకు మేము సిద్ధం – ప్రధాని మోదీ
మయన్మార్ కు మరింత సాయం చేసేందుకు మేము సిద్ధం - ప్రధాని మోదీ
PM Narendra Modi : ఇటీవలి భూకంపంతో పొరుగుదేశం మయన్మార్(Myanmar) తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీనితో భూకంపం దెబ్బకు అతలాకుతలమైన మయన్మార్ కు ‘ఆపరేషన్ బ్రహ్మ’ ద్వారా భారత్ చేయూతను అందించింది. ఈ నేపథ్యంలో మయన్మార్ కు మరింత సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని… బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న బిమ్‌స్టెక్ సదస్సు హాజరైన మయన్మార్ సైనిక ప్రభుత్వాధినేత మిన్ ఆంగ్ లాయింగ్ కు ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. దాదాపు 35 నిమిషాలపాటు సాగిన వీరి భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలు చర్చించారు. మయన్మార్ లో సాధ్యమైనంత త్వరగా, విశ్వసనీయ రీతిలో ఎన్నికలు జరిపించాలని… ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని లాయింగ్ కు మోదీ సూచించారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ బ్రహ్మ’ ద్వారా సహకారం అందించినందుకు మోదీకి మయన్మార్ సైనిక పాలకుడు కృతజ్ఞతలు తెలిపారు. మయన్మార్ దేశంలో 2021 ఫిబ్రవరిలో ఆంగ్ శాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి… లాయింగ్ నేతృత్వంలోని సైన్యం పరిపాలనా బాధ్యతలు చేపట్టింది. అప్పటి నుంచి మోదీతో లాయింగ్ భేటీ కావడం ఇదే తొలిసారి.
PM Narendra Modi – నేపాల్, భూటాన్ ప్రధానులు, థాయ్ లాండ్ రాజుతో ప్రధాని మోదీ భేటీ
నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలితోనూ ప్రధాని మోదీ(PM Narendra Modi) బ్యాంకాక్‌లో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ చర్చించారు. వాణిజ్యం, రవాణా తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతోనూ మోదీ సమావేశమయ్యారు. థాయ్‌లాండ్ రాజు మహా వజీరలాంగ్‌కోర్న్, రాణి సుథిదా బజ్రాసుధాబిమాలలక్షనలతో మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారితో చర్చించారు. ధ్యానముద్రలో ఉన్న సారనాథ్ బుద్ధ విగ్రహాన్ని థాయ్ రాజుకు, డోక్రా మయూర విగ్రహాన్ని ఆ దేశ ప్రధాని షినవాత్ర్‌కు మోదీ బహూకరించారు. బుద్ధుడు పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నట్లు 46 మీటర్ల భారీ విగ్రహం ఉండే ప్రఖ్యాత వాట్ ఫొ ఆలయాన్ని షినవాత్ర్‌తో కలిసి మోదీ సందర్శించారు.
3రోజుల పర్యటనకు శ్రీలంక చేరుకున్న మోదీ
ప్రధాని మోదీ 3 రోజుల పర్యటనకు ప్రధాని మోదీ(PM Narendra Modi) శ్రీలంక చేరుకున్నారు. బ్యాంకాంక్ లో బిమ్‌స్టెక్ సదస్సు పూర్తి చేసుకుని కొలంబో చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో శ్రీలంక మంత్రులు ఘన స్వాగతం పలికారు. 3రోజుల పర్యటనలో భాగంగా మోదీ శ్రీలంక అధ్యక్షుడు అనురతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ, డిజిటల్, ఇంధన భద్రత తదితర రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా భారత సహకారంతో నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. శాంపూర్ సౌరశక్తి ప్రాజెక్టు స్థలాన్ని సందర్శిస్తారు. 6న మోదీ దిస్సనాయకేతో కలిసి అనురాధపురాలోని మహాబోధి ఆలయాన్ని సందర్శిస్తారు.
Also Read : Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, ఎంఐఎం