PM Narendra Modi: ఆదంపుర్ ఎయిర్ బేస్ ను సందర్శించిన ప్రధాని మోదీ
ఆదంపుర్ ఎయిర్ బేస్ ను సందర్శించిన ప్రధాని మోదీ
PM Narendra Modi :భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పంజాబ్ లోని ఆదంపుర్ ఎయిర్‌బేస్(Adampur Air Base) ను సందర్శించారు. అక్కడ జవాన్లతో మమేకమై సైనిక ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకుని వారి ధైర్యసాహసాలను అభినందించారు. పాక్ నడ్డివిరిచిన ఎస్-400 మిసైల్ బ్రాక్‌డ్రాప్‌లో వీర జవాన్లను ప్రధాని సెల్యూట్ చేస్తున్న ఫొటో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ తరువాత చేపట్టిన ఎయిర్ స్ట్రైక్స్ లో పంజాబ్ లోని ఆదంపుర్ ఎయిర్ బేస్ ను పూర్తిగా నాశనం చేసామంటూ పాకిస్తాన్ సైనిక అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(PM Narendra Modi) అదే ఎయిర్ బేస్ ను సందర్శించి… పాకిస్తాన్(Pakistan) అబద్ధాలను ప్రపంచానికి మరోసారి తెలియజేసారు. అంతేకాదు. పాకిస్తాన్ ప్రచారం చేసిన అడ్డగోలు అబద్ధాలు కు గట్టి హెచ్చరిక సంకేతాలు పంపినట్లు అయ్యింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారర్ భద్రతా బలగాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించాయి. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్ మే 9, 10వ తేదీల్లో దాడులకు యత్నించింది. అయితే వాటిని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాయాది టార్గెట్ చేయాలని యత్నించిన వాటిలో ఆదంపుర్ వైమానిక స్థావరం కూడా ఒకటి. తాము చేసిన దాడుల్లో ఈ ఎయిర్ బేస్ పూర్తిగా నాశనం అయిందని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అదంపుర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. వాయుసేన సిబ్బందితో ముచ్చటించి భుజం తట్టారు. ఆపరేషన్ వివరాలను మోదీకి బలగాలు వివరించాయి. గంటన్నరకు పైగా ఆయన అక్కడే గడిపారు. ఆ సమయంలో ఆయన ధరించిన టోపీపై త్రిశూల్ చిత్రం కనిపించింది. భారత్ మాతాకీ జై అంటూ ప్రధాని మోదీ… సైనికులతో కలిసి గట్టిగా స్లోగన్స్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ‘‘ఈ ఉదయం నేను ఆదంపుర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లాను. అక్కడ మన పోరాటయోధులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచేవారితో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం. మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతిచర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారు’’ అని ఎక్స్ వేదికగా మోదీ రాసుకొచ్చారు. అలాగే వారితో దిగిన చిత్రాలను షేర్ చేశారు. పాకిస్తాన్ కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన సత్తా చూపించిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ అనేది ప్రపంచమంతా మార్మోగిందని, ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
PM Narendra Modi – నా జీవితం ధన్యమైంది – ప్రధాని మోదీ
‘దేశ ప్రజలంతా సైన్యానికి అండగా నిలబడ్డారు. భారత్ శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది. మన సైన్యం సామర్థ్యం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. వీర సైనికులందరికీ నా సెల్యూట్. ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మారుమ్రోగింది. సైన్యం దేశ ఆత్మ విశ్వాసం పెంచింది. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సిద్ధాంతం. అక్క చెల్లెల సిందూరం తుడిచినవారిని నాశనం చేశాం’ అని మోదీ సైన్యాన్ని కొనియాడారు. ‘గురిచూసి కొట్టిన దెబ్బతో.. శత్రు స్థావరాలు మట్టిలో కలిశాయి. వారు వెనుక నుంచి దాడి చేస్తే… మీరు ముందు నిలబడి ధైర్యంగా దాడిచేశారు. పాకిస్తాన్ డ్రోన్స్, యూవీఏలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేకపోయాయి. పాక్ శత్రువులు పౌరులను అడ్డుపెట్టుకుని దాడులకు పాల్పడింది. కానీ మీరు మాత్రం పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా శత్రువును దెబ్బకొట్టారు. అణు బ్లాక్ మెయిల్‌ను భారత్ ఎప్పటికీ సహించదు. మళ్ళీ ఉగ్రదాడి జరిగితే.. భారత్ కచ్చితంగా సమాధానం ఇస్తుంది. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.
Also Read : CJI Sanjiv Khanna: అధికార పదవులకు దూరం – సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా