PM Narendra Modi: వంటనూనె వినియోగం తగ్గించి… వ్యాయామం చేయండి – ప్రధాని మోదీ

వంటనూనె వినియోగం తగ్గించి... వ్యాయామం చేయండి - ప్రధాని మోదీ

Narendra Modi : జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధుల్లో మన ఆరోగ్యానికి పెను ముప్పుగా మారే జబ్బుల్లో ఊబకాయం ఒకటని… అదే అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. ఇటీవల విడుదలైన ఒక సర్వే ప్రకారం మన దేశంలో 2050 నాటికి 44 కోట్ల మంది ప్రజలు ఊబకాయ సమస్య బారిన పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్‌ హవేలీలోని సిల్వస పట్టణంలో రూ.2,587 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ… ఊబకాయం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలన్నారు. బరువు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. వంట నూనెల వినియోగం 10 శాతం తగ్గించాలని తాను ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేశానన్నారు. అందరూ 10 శాతం తక్కువగా వంట నూనెలను కొనుగోలు చేస్తామని ప్రతినబూనాలని కోరారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం, సైక్లింగ్‌ చేయాలని చెప్పారు.

PM Narendra Modi Comment

దాద్రా-నగర్‌ హవేలీలోని సిల్‌వాసాలో జరిగిన పలు అభివృద్ధి, ప్రారంభ, భూమిపూజ కార్యక్రమాల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ(Narendra Modi) మాట్లాడుతూ… ‘‘మన జీవనశైలితో ముడిపడిన వ్యాధులతో మన ఆరోగ్యానికి భారీ ముప్పు పొంచిఉంది. ఊబకాయం వాటిల్లో ఒకటి. ఇది అనేక వ్యాధులకు మూలకారణంగా నిలుస్తోంది. 2050 నాటికి దేశంలో ఊబకాయుల సంఖ్య 44 కోట్లకు చేరుతుందని ఓ నివేదిక పేర్కొంది. ఈ సంఖ్య చాలా పెద్దది… భయపెట్టేది. నివేదికలోని అంశం వాస్తవరూపం దాలిస్తే… ప్రతిముగ్గురిలో ఒకరు ఊబకాయంతో బాధపడతారు.

ఈ పరిస్థితి తలెత్తకుండా ప్రజలు తమ ప్రయత్నాన్ని ప్రారంభించాలి. అదేవిధంగా వంటనూనెల వాడకాన్ని 10 శాతం తగ్గించాలని గతంలోనే సూచించాను. వంటనూనెల కొనుగోలును 10 శాతం తగ్గిస్తామంటూ ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, సైక్లింగ్‌తో ఊబకాయం దూరమవుతుంది’’ అని మోదీ పేర్కొన్నారు. ప్రజలకు చౌకధరల్లో మందులను అందించేందుకు దేశవ్యాప్తంగా కొత్తగా మరో 25 వేల జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు సుమారు రూ.30 వేల కోట్లు ఆదా అయ్యాయన్నారు.

Also Read : CM MK Stalin: నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు సీఎం స్టాలిన్‌ లేఖ

Leave A Reply

Your Email Id will not be published!