PM Narendra Modi: ఆపరేషన్ సిందూర్ విషయంలో విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్‌

ఆపరేషన్ సిందూర్ విషయంలో విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్‌

Narendra Modi : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ పై లోక్‌సభలో వాడీవేడిగా చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విషయంలో విపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఆపరేషన్‌ మహాదేవ్‌ ద్వారా పహల్గాంలో దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వెల్లడించారు. అయితే ఆపరేషన్‌ మహాదేవ్‌ నిన్న ఎందుకు చేపట్టారని విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు పట్టుకున్నారు… నిన్ననే ఎందుకు కాల్చారంటూ ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదుల్ని హతం చేయడానికీ తేదీలు, వారాలు చూడాలా?’’ అని ప్రధాని ప్రశ్నించారు.

‘‘సైన్యంపై నమ్మకం ఉన్నచోటే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది. దేశం సురక్షితంగా ఉన్నప్పుడే విజ్ఞానపరంగా అభివృద్ధి చెందుతాం. కాంగ్రెస్‌ ఎప్పుడూ నిరాశాభావంలోనే ఉంటోంది. ఆయుధపరంగా ఎంత పటిష్ఠంగా ఉన్నా… శాంతి కోసమే ప్రయత్నిస్తాం. పీవోకేను తిరిగి కైవసం చేసుకోవాలని విపక్షాలు అడుగుతున్నాయి. పీవోకేను ఎందుకు వెనక్కి తీసుకురాలేదని కాంగ్రెస్‌ అడుగుతోంది. ఎవరి కాలంలో పీవోకే… పాక్‌ కబ్జాలోకి వెళ్లిందో అందరికీ తెలుసు. దేశభద్రత విషయంలో కాంగ్రెస్ మొదట్నుంచీ ఉదాసీనంగానే వ్యవహరించింది’’ అని ప్రధాని మోదీ (Narendra Modi) ఆక్షేపించారు.

Narendra Modi – సువర్ణావకాశాన్ని వృథా చేసింది కాంగ్రెస్ మాత్రమే – ప్రధాని మోదీ

‘‘1971లో పీవోకేను వెనక్కి తీసుకొనే అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదు. అప్పుడు వేలాది మంది పాక్‌ సైనికులు మనకు బందీలుగా చిక్కారు. 1971లో మన సైన్యం పాక్ భూభాగంలో వేల కిలోమీటర్లు ముందుకెళ్లింది. ముందుచూపుతో వ్యవహరించి ఉంటే పీవోకేను అప్పుడే తిరిగి పొందేవాళ్లం. పీవోకేను తిరిగి పొందే సువర్ణావకాశాన్ని కాంగ్రెస్‌ వృథా చేసింది. 1974లో కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించారు. కచ్చతీవు దీవులు శ్రీలంకకు వెళ్లిపోవడంతో తమిళ జాలర్లు ఇబ్బందులు పడుతున్నారు’’ అన్నారు.

‘జాతీయ భద్రతా విజన్‌ కాంగ్రెస్‌కు గతంలో లేదు… భవిష్యత్తులో వచ్చే ప్రశ్నేలేదు. స్వాతంత్ర్యం తర్వాత తీసుకున్న నిర్ణయాలతో భారత్‌ ఇప్పటికీ శిక్ష అనుభవిస్తోంది. యూపీఏ హయాంలో ఎన్ని ఉగ్రదాడులు జరిగినా పాక్‌కు ఉన్న మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ హోదాను తొలగించలేదు. పహల్గాం దాడుల తర్వాత పాక్‌కు ఆ హోదాను తొలగించాం. ఈ ఘటన తర్వాత సరిహద్దులు మూసివేశాం… వీసాలు రద్దు చేశాం. నెహ్రూ ఆనాడు చేసుకున్న సింధు జలాల ఒప్పందంతో ‘నదులు మనవి.. జలాలు పాక్‌వి’ అన్నట్లుగా మారింది. ఆ ఒప్పందం కుదుర్చుకోకపోయి ఉంటే భారత భూభాగం సస్యశ్యామలమయ్యేది’’ అని తెలిపారు.

భారత్‌ యుద్ధ దేశం కాదు… బుద్ధ దేశం – ప్రధాని మోదీ

భారత రక్షణ పరిశ్రమల్లో సంస్కరణలు తీసుకొచ్చాం. రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమలకు తలుపులు తెరిచాం. గతంతో పోలిస్తే రక్షణ బడ్జెట్‌ మూడింతలు పెరిగింది. రక్షణ ఉత్పత్తుల్లో 250శాతం వృద్ధి నమోదైంది. భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 30 రెట్లు పెరిగాయి. మన రక్షణ ఉత్పత్తులు 100 దేశాలకు చేరుతున్నాయి. రక్షణ ఉత్పత్తుల మార్కెట్‌లో భారత్‌ జెండా పాతింది. ఆత్మనిర్భర్‌ ఉత్పత్తులతో భారత యువత సత్తా చాటుతోంది. ఆయుధాలమయమైన ప్రపంచంలో విశ్వశాంతి ముఖ్యం. భారత్‌ యుద్ధ దేశం కాదు.. బుద్ధ దేశం’’ అని మోదీ అన్నారు.

Also Read : Daya Nayak: ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్ దయా నాయక్‌ కు ప్రమోషన్‌

Leave A Reply

Your Email Id will not be published!