PM Narendra Modi: ఎర్రకోటపై ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఎర్రకోటపై ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Narendra Modi : దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర బలగాల విన్యాసాలు, వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం చేసారు.
Narendra Modi – దేశ యువత కోసం లక్ష కోట్లతో కొత్త పథకం – ప్రధాని మోదీ
దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు ప్రధాని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద అమలుచేయనున్నామని చెప్పారు. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున నెలకు రూ.15వేలు అందించనున్నట్లు చెప్పారు. ‘‘అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్.. నేడు స్వయంసమృద్ధి దిశగా నడుస్తోంది. తిండిగింజల కోసం ఇబ్బందిపడిన దేశం.. నేడు ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. ప్రతి రంగంలోనూ స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తోన్న భారత్, ఎన్ని ఇబ్బందులొచ్చినా వెనకడుగు వేసేదే లేదు’’ అని పీఎం స్పష్టం చేశారు.
Narendra Modi – త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్‌లు
‘‘స్వయంసమృద్ధి అంటే డాలర్లు, పౌండ్లు కాదు. సమున్నతంగా నిలబడటం. ఎగుమతి, దిగుమతులు, ఆదాయ వ్యయాలే స్వయంసమృద్ధి కాదు. మేకిన్ ఇండియా ఏంటో ఆపరేషన్ సిందూర్ చాటి చెప్పింది. భారత్‌లో తయారీ నినాదం రక్షణరంగంలో మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది. భారత్ సమున్నత శక్తిగా ఎదుగుతోంది. ఇవాళ ప్రపంచం భారత్‌ను విస్మరించలేదు. టెక్నాలజీ కోసమో, సాయం కోసమో భారత్ ప్రపంచాన్ని అర్థించట్లేదు. సెమీ కండక్టర్లు సహా అనేక విషయాల్లో సొంత కాళ్లపై నిలబడుతోంది. 50-60 ఏళ్ల క్రితమే వీటి తయారీ ఆలోచన ఉంది. త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్‌లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి’’ అని మోదీ వివరించారు.
Narendra Modi – జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు
‘‘అన్ని రంగాల్లో సంస్కరణలు తెస్తున్నాం. జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు, చేర్పులు చేస్తు్న్నాం. జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు దీపావళి లోపు వస్తాయి. సామాన్యులకు కొత్త జీఎస్టీ సంస్కరణలు దీపావళి కానుకగా ఇస్తాం. సామాన్యులపై భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని మోదీ పేర్కొన్నారు.
Narendra Modi – భారత్ కు స్వంతంగా ఓ అంతరిక్ష కేంద్రం
ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష రంగంలో భారతదేశం స్వావలంబన సాధించే దిశగా కృషి చేస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. అంతరిక్షయానం పూర్తి చేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ను ప్రత్యేకంగా అభినందించారు. అంతరిక్ష రంగంలో కూడా భారతదేశం స్వావలంబన సాధించడానికి కృషి చేస్తోందని, గగన్‌యాన్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోందని ప్రధాని తెలిపారు. ‘మన అంతరిక్ష రంగం పట్ల దేశం గర్విస్తోంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చారు. త్వరలోనే ఆయన భారతదేశానికి తిరిగి వస్తారు’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. త్వరలోనే భారత్ స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని, అవి అంతరిక్ష రంగంలో పని చేస్తున్న 300కు పైగా స్టార్టప్ కంపెనీలకు మేలు చేకూరుస్తాయని ప్రధాని పేర్కొన్నారు. వేలాది మంది యువతీయువకులు అంతరిక్ష రంగంలో పనిచేస్తున్నారని, ఇది మన యువ శక్తిపై మనకు ఉన్న నమ్మకం అని వ్యాఖ్యానించారు. అలాగే అణు ఇంధన రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
Also Read : Bandi Peddiraju: సీబీఐ అధికారి బండి పెద్దిరాజుకు రాష్ట్రపతి పోలీసు పతకం
