PM Narendra Modi: అంతరిక్షంలో ఉన్న శుభాంశు శుక్లాతో ముచ్చటించిన ప్రధాని మోదీ
అంతరిక్షంలో ఉన్న శుభాంశు శుక్లాతో ముచ్చటించిన ప్రధాని మోదీ
Narendra Modi : భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)… ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో మార్మోగింది. 41 ఏళ్ల విరామం తర్వాత రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియో లింక్ ద్వారా ప్రధాని మోదీ (Narendra Modi) సంభాషించినప్పుడు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్లా (Shubhanshu Shukla) మిషన్ తో భారత స్వీయ మానవసహిత యాత్ర గగన్‌యాన్ దిశగా తొలి అడుగుపడిందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శుక్లా (Shubhanshu Shukla) మాట్లాడుతూ… ‘‘అంతరిక్ష కేంద్రం భూమిని రోజుకు 16 సార్లు చుడుతోంది. నిత్యం 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను వీక్షించే అవకాశం నాకు కలిగింది. ఇప్పుడు గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నాం. మన దేశం పురోగమిస్తున్న వేగానికి ఇది అద్దం పడుతోంది. అంతరిక్షం నుంచి భారత్‌ను (India) మెుదటిసారి చూసినప్పుడు భవ్యంగా కనిపించింది’’ అని పేర్కొన్నారు.
Narendra Modi – మోదీ, శుభాంశుల మధ్య సాగిన 18 నిమిషాల సంభాషణలోని ముఖ్యాంశాలివే
మోదీ: శుభాంశు..! నేడు మీరు భారత భూభాగానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ.. ప్రతి భారతీయుడి హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్నారు. మీ పేరులో ‘శుభం’ ఉంది. అందువల్ల శుభప్రదమైన నవశకానికి మీ యాత్ర నాంది పలికింది. నా గొంతులో భారతీయుల ఉత్సాహం ఉంది. అంతరిక్షంలో భారతీయ జెండాను ఎగురవేసినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. అక్కడ అంతా బాగుందా ? మీ ఆరోగ్యం ఎలా ఉంది ?
శుభాంశు: మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో నేను ఇక్కడ క్షేమంగా, సురక్షితంగా ఉన్నా. ఇక్కడ చాలా బాగుంది. ఈ యాత్ర నాది మాత్రమే కాదు. దేశమంతటిదీ. ఇది నాకు పెద్ద అవకాశం. దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉంది.
మోదీ: రోదసిలో మీరెన్నో పరిశోధనలు చేస్తున్నారు ? రాబోయే రోజుల్లో వ్యవసాయం, ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోగం ఏదైనా ఉందా ?
శుభాంశు: గర్వంగా చెప్పగలను. మొదటిసారి భారతీయ శాస్త్రవేత్తలు ఏడు వినూత్న పరిశోధనలకు రూపకల్పన చేశారు. వాటిని ఐఎస్‌ఎస్‌కు తీసుకొచ్చా. మెుదటి పరిశోధనను మూలకణాలపై చేపట్టాల్సి ఉంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఫలితంగా కండరాల క్షీణత చోటు చేసుకుంటుంది. ప్రత్యేక పదార్థం తీసుకోవడం ద్వారా కండరాల క్షీణతను నిలువరించటం లేదా దాన్ని జాప్యం చేయడంపై నా పరిశోధన దృష్టిపెడుతుంది. కండరాల క్షీణతతో భూమిపైన బాధపడే వృద్ధులకు ఈ ప్రత్యేక పదార్థం ఉపయోగపడుతుందేమో పరీక్షిస్తాం. రెండోది సూక్ష్మ ఆల్గే వృద్ధి ప్రయోగం. ఇక్కడ దాని వృద్ధిని చూస్తే ఆ ప్రక్రియను అనుసరిస్తే పెద్దమొత్తంలో అభివృద్ధి చేసి పోషకాలు అందించవచ్చు. ఇది ఆహార భద్రతకు కూడా ఉపకరిస్తుంది.
మోదీ: అక్కడి పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయి. వాటికి ఎలాఅలవాటుపడుతున్నారు ?
శుభాంశు: ఇక్కడ అన్నీ భిన్నంగా ఉన్నాయి. ఏడాది శిక్షణ తీసుకున్నాను. మెుత్తం వ్యవస్థలు, ప్రయోగాల గురించి మాకు తెలుసు. కానీ ఇక్కడికి రాగానే అకస్మాత్తుగా మెుత్తం మారిపోయింది. భారరహితస్థితి కారణంగా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నా కాళ్లను కట్టుకున్నాను. లేదంటే పైకి వెళ్లిపోతాను. నీళ్లు తాగాలన్నా, నడవాలన్నా, నిద్రించాలన్నా కష్టం. సీలింగ్ పైన, గోడలపై కూడా విశ్రమించొచ్చు. శిక్షణ బాగుంది. కానీ మారిన వాతావరణానికి అలవాటు పడడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది.
మోదీ: సైన్స్, ఆధ్యాత్మికం భారత్ ప్రత్యేకతలు. స్పేస్ సెంటర్‌లో మనశ్శాంతి కోసం ధ్యానం ఏమైనా ఉపయోగపడుతోందా?
శుభాంశు: కచ్చితంగా ఉపయోగపడుతోంది. భారత్ ఇప్పటికే యోగా కార్యక్రమాలు చాలా చేస్తోంది. అంతరిక్షంలో మనశ్శాంతి ఉండదని చాలామంది అన్నారు. సాధారణ శిక్షణ తీసుకునేప్పుడు, రాకెట్ లాంచ్ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యా. ప్రతికూల పరిస్థితుల్లో ధ్యానం చాలా ఉపయోగపడుతుంది.
అనుభవాలు నిక్షిప్తం చేసుకోండి
‘‘గగన్‌యాన్ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లాలి. మన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలి. చందమామపై భారత వ్యోమగామి దిగాలి. మీరు నేర్చుకున్న అంశాలు భవిష్యత్ యాత్రల్లో కీలక పాత్ర పోషిస్తాయి. మీ ప్రతి అనుభవాన్నీ జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుంటున్నారనుకుంటున్నా’’ అని శుభాంశుకు మోదీ (Narendra Modi) సూచించారు. ఒక స్పాంజీలా అన్ని అనుభవాలను ఒడిసిపడుతున్నానని శుభాంశు బదులిచ్చారు. చివర్లో మోదీ ‘భారత్ మాతా కీ జై’ అని నినదించగా.. శుక్లా కూడా ఆయనతో గొంతు కలిపారు.
Also Read : Parag Jain: ‘రా’ నూతన సారథిగా పరాగ్ జైన్
