PM Narendra Modi: బిహార్‌ మహిళల ఖాతాల్లోకి పదేసి వేలు చొప్పున జమచేసిన మోదీ

బిహార్‌ మహిళల ఖాతాల్లోకి పదేసి వేలు చొప్పున జమచేసిన మోదీ

PM Narendra Modi : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీయే కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర మహిళల అభ్యున్నతికి ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని శుక్రవారం ప్రధాని మోదీ దిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 75 లక్షలమంది మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్, పలువురు మంత్రులు సహా పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బిహార్‌ (Bihar) ఎన్డీయే సర్కారు రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని రూపొందించింది. ప్రతి కుటుంబంలోని ఓ మహిళకు జీవనోపాధిలో భాగంగా వారు ఎంచుకున్న రంగంలో ఆర్థికసహాయం అందిస్తారు. మంచి ఫలితాలు సాధిస్తే తదుపరి దశల్లో రూ.2 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయం, పశుపోషణ, హస్తకళలు, టైలరింగు, నేత, చిన్నతరహా సంస్థల వంటి ఎంపిక చేసిన రంగాల్లో మహిళలకు ఆర్థిక సహాయం చేస్తారు.

PM Narendra Modi Launches

ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Narendra Modi) మాట్లాడుతూ… బిహార్‌లో మహిళా సాధికారత కోసం ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన’పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. బిహార్‌ (Bihar) మహిళల ప్రగతి కోసం నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం కీలకమైన అడుగు ముందుకు వేసిందని అన్నారు. మన అక్కచెల్లెమ్మలు, ఆడబిడ్డలు ఉద్యోగాలు సంపాదిస్తే, స్వయం ఉపాధి పొందితే వారి కలలకు రెక్కలొచ్చినట్లేనని చెప్పారు. సమాజంలో వారి గౌరవం మరింత పెరుగుతుందని ఉద్ఘాటించారు. 11 ఏళ్ల క్రితం తాము తీసుకున్న ‘జన్‌ధన్‌ ఖాతాల’ సంకల్పం వల్లే ఈరోజు 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైందని వివరించారు.

బిహార్‌ మహిళలకు నితీశ్‌ కుమార్, నరేంద్ర మోదీ (PM Narendra Modi) అనే ఇద్దరు సోదరులు ఉన్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తమ సోదరీమణుల బాగు కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకాన్ని ఈ రోజు ప్రారంభించడం పట్ల గర్విస్తున్నానని స్పష్టంచేశారు. ఇటీవలే ప్రారంభించిన ‘జీవిక నిధి సఖ్‌ సహకారి సంఘ్‌’ను ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజనతో అనుసంధానిస్తామని ప్రకటించారు. పీఎం ఉజ్వల యోజన, ఉచిత రేషన్‌ సరుకుల పంపిణీ, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలతో 8.5 కోట్ల మంది బిహారీల జీవితాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను లఖ్‌పతీ దీదీలుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఇప్పటికే 2 కోట్ల మందికిపైగా మహిళలు లఖ్‌పతీ దీదీలుగా మారారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు.

డబ్బులు ఎరవేసి ఓట్లు దండుకోవాలని కుట్ర ఎన్డీయేపై ప్రియాంక ధ్వజం

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అందించే చిరు బహుమతులను చూసి మోసపోవద్దని, వారికి ఓట్లు తప్ప మరేమీ అక్కర్లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ బిహార్‌ మహిళలకు విజ్ఞప్తిచేశారు. శుక్రవారం బిహార్‌లో పర్యటించిన ఆమె… ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన’ను ఉద్దేశించి మాట్లాడారు. దీని వెనుక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, సీఎం నీతీశ్‌ కుమార్‌ అసలు ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలని మహిళలను కోరారు. ‘‘ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తోంది. కానీ…ఈ పథకం ప్రతి నెలా కొనసాగుతుందన్న హామీని వారు ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. కపట బుద్ధిని ముందుగానే పసిగట్టే సామర్థ్యం స్త్రీలకు ఉంటుంది. మీకు గౌరవం, భద్రత అవసరమని వారు అర్థం చేసుకోవడం లేదు. గత పదేళ్లలో రాష్ట్రంలో మహిళలపై నేరాలు పదిరెట్లు పెరిగాయి’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. భూమి లేని వారికి భూములు ఇస్తామని, సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఉచిత రోగ నిర్ధారణ, చికిత్సను అందిస్తామని తమ పార్టీ హామీ ఇస్తోందని తెలిపారు.

Also Read : Teacher: ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాసిన ఉత్తరాఖండ్‌ లో టీచర్

Leave A Reply

Your Email Id will not be published!