PM Narendra Modi: ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సదస్సుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
‘బ్రిక్స్’ శిఖరాగ్ర సదస్సుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Narendra Modi : బ్రెజిల్ లో ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్న 17వ ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సదస్సుపై భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతియుతమైన బహుళ ధ్రువ ప్రపంచాన్ని భారత్ ఆకాంక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యానికి కట్టుబడి ఉంటామన్నారు. వ్యవస్థాపక దేశం హోదాలో ఆ కూటమి బలోపేతానికి అన్ని చర్యలను చేపడతామని మోదీ (Narendra Modi) వెల్లడించారు. ఈ సదస్సు సందర్భంగా రియో డి జనీరోలో వివిధ దేశాల ప్రభుత్వాధినేతలతో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తానన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వాతో జరిగే సమావేశంలో వర్ధమాన దేశాల బలోపేతంపై ముఖ్య చర్చ జరుగుతుందన్నారు.
PM Narendra Modi Key Comments on Brics Summit
ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన కోసం బుధవారం ఉదయం దిల్లీ నుంచి బయల్దేరారు. తొలుత ఘనా రాజధాని అక్రా చేరుకున్న భారత ప్రధానికి అరుదైన స్వాగతం లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహమ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీని ఆత్మీయంగా స్వాగతించడం విశేషం. గత మూడు దశాబ్దాల్లో భారత ప్రధాని ఒకరు ఘనాను సందర్శించడం ఇదే ప్రథమం. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహమతో ప్రధాని భేటీ అనంతరం రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృత స్థాయి భాగస్వామ్యంగా మార్చాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మోదీ ఇక్కడి నుంచి గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వెళ్తారు. ఆ తర్వాత అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లోనూ పర్యటించనున్నారు.
Also Read : Indigo: కర్నూలు- విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం
