PM Narendra Modi: ప్రధాని మోదీ ‘ది ఎమర్జెన్సీ డైరీస్‌’

ప్రధాని మోదీ ‘ది ఎమర్జెన్సీ డైరీస్‌’

Narendra Modi : దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి నేటితో 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈసందర్భంగా ఆ నాటి రోజులను గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)… గత కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాటి దురాగతాలను భారతీయులెవరూ ఎన్నటికీ మర్చిపోలేరని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ రోజుల్లో తన ప్రయాణాన్ని వివరించే ఓ పుస్తకం రానున్నట్లు ప్రధాని ప్రకటించారు. ‘ది ఎమర్జెన్సీ డైరీస్‌’ పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నారు.

PM Narendra Modi ‘Emergency Dairy’

‘‘ఎమర్జెన్సీ విధించిన సమయంలో నేను ఆర్‌ఎస్‌ఎస్‌లో యువ ప్రచారక్‌గా పనిచేస్తున్నా. అత్యయిక స్థితికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం… నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. అనుభవాలను మిగిల్చింది. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఉద్యమం పునరుద్ఘాటించింది. అదే సమయంలో ఎంతోమంది రాజకీయ ప్రముఖుల నుంచి నేర్చుకునే అవకాశం కల్పించింది. ఆ అనుభవాల్లో కొన్నింటిని సమీకరించి ‘బ్లూక్రాఫ్ట్‌ డిజిటల్‌ ఫౌండేషన్‌’ పుస్తక రూపంలో తీసుకొస్తోంది. ‘ది ఎమర్జెన్సీ డైరీస్‌’.. అత్యయిక స్థితి నాటి రోజుల్లో నా ప్రయాణాన్ని వివరిస్తుంది. ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది’’ అని మోదీ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ పుస్తకానికి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ముందుమాట రాశారు. దీన్ని బుధవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు.

ఈసందర్భంగా ఎమర్జెన్సీకి కారణమైన నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ‘‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిన ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. దీన్ని ‘సంవిధాన్‌ హత్య దివస్‌’గా నేడు ప్రజలు గుర్తుంచుకోనున్నారు. యాభై ఏళ్ల క్రితం ఇదే రోజున భారత రాజ్యాంగ విలువలను పక్కన బెట్టి, ప్రాథమిక హక్కులను అణచివేసి, పత్రికా స్వేచ్ఛను కాలరాసి.. ఎంతోమంది రాజకీయ నేతలు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, సామాన్య పౌరులను జైలుకు పంపించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిర్బంధానికి గురిచేసింది. రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించి వారు ప్రవర్తించిన తీరును భారతీయులెవరూ ఎన్నటికీ మర్చిపోలేరు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ మేం సెల్యూట్‌ చేస్తున్నాం. రాజ్యాంగ విధానాలను మరింత బలోపేతం చేసి వికసిత్‌ భారత్‌ను నిర్మించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేస్తూ కొత్త శిఖరాలను అధిరోహిస్తాం’’ అని మోదీ రాసుకొచ్చారు.

Also Read : Shubhanshu Shukla Messsage: అంతరిక్షం నుంచి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మెసేజ్‌

Leave A Reply

Your Email Id will not be published!