PM Narendra Modi: ఎలాన్‌ మస్క్‌ కు ప్రధాని మోదీ ఫోన్‌ కాల్

ఎలాన్‌ మస్క్‌ కు ప్రధాని మోదీ ఫోన్‌ కాల్

Narendra Modi : టారీఫ్ ల విషయంలో భారత్‌, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలోని డోజ్‌ విభాగ అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌(Elon Musk) తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ లో చర్చలు జరిపారు. సాంకేతికత, నూతన ఆవిష్కరణల్లో భాగస్వామ్యం గురించి వారు చర్చించారు. ఇదే విషయాన్ని మోదీ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

PM Narendra Modi Call to Elon Musk

‘‘టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌తో పలు అంశాలపై మాట్లాడా. ఈ ఏడాది ఆరంభంలో వాషింగ్టన్‌లో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలనూ మేం ప్రస్తావించాం. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించాం. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్‌ కృతనిశ్చయంతో ఉంది’’ అని మోదీ రాసుకొచ్చారు.

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని టెస్లా, స్టార్‌ లింక్‌ ఇంటర్నెట్‌ సంస్థలు భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వేళ వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రధానితో మస్క్‌ భేటీ అయ్యారు. అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ వంటి రంగాలపై వీరిద్దరూ చర్చలు జరిపారు. ఈ భేటీ జరిగిన కొన్ని రోజులకే… భారత్‌ లో టెస్లా నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇక, షోరూం ఏర్పాటు కోసం స్థలం ఎంపికపైనా మస్క్‌ సంస్థ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు, మన దేశంలో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో, సునీల్‌ భారతీ మిత్తల్‌ కు చెందిన భారతీ ఎయిర్‌టెల్‌ ఒప్పందం చేసుకున్నాయి. అయితే, స్టార్‌లింక్‌కు భారత్‌ ఇంకా అనుమతులు మంజూరు చేయలేదు. ఈ క్రమంలోనే ఆ సంస్థ ప్రతినిధుల బృందంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల సమావేశమయ్యారు. స్టార్‌లింక్‌కు ప్రస్తుతమున్న భాగస్వామ్యాలు, భారత్‌లో భవిష్యత్‌ పెట్టుబడులు ప్రణాళికపై చర్చలు జరిపారు.

Also Read : Gold: అక్రమంగా తరలిస్తున్న 18 కేజీల బంగారం పట్టుకున్న ప్రొద్దుటూరు పోలీసులు

Leave A Reply

Your Email Id will not be published!