PM Narendra Modi: పులి పిల్లలతో ప్రధాని మోదీ ఆటలు !

పులి పిల్లలతో ప్రధాని మోదీ ఆటలు !

Narendra Modi : గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ… రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం నిర్వహిస్తున్న వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన వంతారాను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా మోదీకి స్వాగతం పలికారు. అనంతరం అనంత్‌ అంబానీతో కలిసి ప్రధాని మోదీ(Narendra Modi) వంతారా మొత్తం కలియదిరిగారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పునరావాసం పొందుతున్న వివిధ రకాల జంతువులతో ప్రధాని సరదాగా గడిపారు. పులి, సింహం పిల్లలతో కాసేపు ఆడుకున్నారు. సింహాల పిల్లలకు, జిరాఫీలకు ఆహారం అందించారు. అక్కడ జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్‌లు, ICUలు మొదలైన వాటితో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు. అంతే కాకుండా వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు. ఆసియాటిక్ సింహానికి MRI చేయడం, హైవేలో కారు ఢీకొట్టిన తర్వాత గాయపడిన చిరుతకు ఆపరేషన్ చేయడం వంటి దృశ్యాలను మోదీ చూసారు.

PM Narendra Modi..

వంతారా కేంద్రంలో… రక్షించబడిన జంతువులను వాటి సహజ ఆవాసాలను దగ్గరగా ప్రతిబింబించే ప్రదేశాలలో ఉంచారు. ఇక్కడ ఆసియాటిక్ సింహం, చిరుత, ఒక కొమ్ము గల ఖడ్గమృగం, జిరాఫీ, చింపాంజీ, ఒరంగుటాన్‌, హిప్పోపొటామస్‌, మొసళ్ళు, ఏనుగులు, పెద్ద పాములు మొదలైన జంతువులను మోదీ చూసారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన ఏనుగుల ఆసుపత్రిని కూడా ఆయన సందర్శించారు. జంతువులను వీక్షించడమే కాకుండా.. వాటికి సేవ చేస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది, కార్మికులతో ప్రధానమంత్రి సంభాషించారు. వంతారాలో 2,000 కంటే ఎక్కువ జాతులు.. రక్షించబడిన, అంతరించిపోతున్న 1.5 లక్షలకు పైగా జంతువులు ఉన్నాయి. అనంతరం ఆసియాటిక్ సింహం పిల్లలు, తెల్ల సింహం పిల్ల, అరుదైన మరియు అంతరించిపోతున్న జాతి చిరుతపులి పిల్ల, కారకల్ పిల్ల వంటి వివిధ జాతులతో సరదాగా గడిపడమే కాకుండా.. వాటికి పాలు పట్టించడం వంటివియు కూడా మోదీ చేశారు. ప్రస్తుతం ఈ పులిపిల్లకు ప్రధాని పాలు పట్టిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సోమవారం గుజరాత్‌ లోని జునాగఢ్‌ జిల్లాలో ఉన్న గిర్‌ అభయారణ్యంలో పర్యటించారు. సింహాల్ని చూడడానికి సఫారీ చేశారు. వీటి ఆవాస ప్రాంతాన్ని సంరక్షించడంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోని గిరిజనులు, మహిళలు చేస్తున్న కృషిని కొనియాడారు. ‘‘గిర్‌ ప్రాంతానికి రాగానే గుజరాత్‌(Gujarat) సీఎంగా నేను ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలతో కలిసి చేసిన ప్రయత్నాలు మదిలో మెలగుతున్నాయి. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉమ్మడి ప్రయత్నాల వల్ల మృగరాజుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. వీటితోపాటు పులులు, చిరుతలు, ఖడ్గమృగాల సంఖ్యా వృద్ధి చెందుతోంది. వన్యప్రాణులపై మనకున్న బలమైన ఆపేక్షను, వాటి ఆవాసాలు సుస్థిరంగా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇవి చాటుతున్నాయి’’ అని ‘ఎక్స్‌’లో రాశారు. తనకు తారసపడిన సింహాల ఛాయాచిత్రాలనూ జతచేశారు.

Also Read : Dhananjay Munde: సర్పంచ్ హత్యకేసులో మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ రాజీనామా !

Leave A Reply

Your Email Id will not be published!