PM Narendra Modi: ప్రధాని మోదీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం

PM Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ… ఐదురోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ద్వీపదేశమైన సైప్రస్‌ లో తొలిసారిగా పర్యటించిన ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. మోదీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మకరియోస్‌ 3’ను ఆ దేశ ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈసందర్భంగా ప్రధాని మోదీ (PM Narendra Modi) మాట్లాడుతూ… అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమన్నారు. రెండు దేశాల సంస్కృతి, సోదరభావం, వసుధైవ కుటుంబకం భావనకు ప్రతీక అని చెప్పారు.

PM Narendra Modi Cyprus Country Award

ఈ అవార్డును ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గుర్తింపు ఇరుదేశాల శాంతిభద్రతలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, శ్రేయస్సుపై పరస్పర నిబద్ధతను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. భారత్‌-సైప్రస్‌ మధ్య ఉన్న క్రియాశీల భాగస్వామ్యం భవిష్యత్తులో కొత్త శిఖరాలను చేరుకుంటుందని మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. ఇరుదేశాలు తమ దేశాల పురోగతిని బలోపేతం చేయడమే కాకుండా సురక్షితమైన, శాంతియుత వాతావరణాన్ని నిర్మించడానికి దోహదపడతాయన్నారు.

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం సైప్రస్‌ చేరుకున్నారు. ఆయనకు లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశాధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలిడెస్‌ సాదర స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని సైప్రస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్, సైప్రస్‌ సంబంధాల్లో గణనీయ ప్రగతికి ఈ పర్యటన దోహదం చేయనుందని.. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులపై మరింతగా కలిసి పనిచేసే అవకాశముంది అని మోదీ పేర్కొన్నారు. సైప్రస్‌ పర్యటన అనంతరం.. ప్రధాని మోదీ కెనడా వెళ్లి అక్కడ జరగనున్న జీ7 సదస్సులో పాల్గొంటారు. అక్కడి నుంచి క్రొయేషియా పర్యటనకు వెళ్తారు.

Also Read : Saudi Airlines: హజ్ యాత్రికుల విమానానికి తప్పిన పెను ప్రమాదం

Leave A Reply

Your Email Id will not be published!