PM Narendra Modi: జమ్మూ-కశ్మీర్ ఉగ్రదాడులపై ప్రధాని మోదీ సమీక్ష !
జమ్మూ-కశ్మీర్ ఉగ్రదాడులపై ప్రధాని మోదీ సమీక్ష !
PM Narendra Modi: జమ్మూ-కశ్మీర్ లో వరుస ఉగ్ర దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జమ్మూ-కశ్మీర్‌లోని భద్రత పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) గురువారం సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్, జమ్మూ-కశ్మీర్ ఎల్జీ మనోజ్‌సిన్హాలతో మాట్లాడారు. స్థానికంగా భద్రత పరిస్థితులు, ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి వారు ప్రధానికి వివరించారు. ఈ క్రమంలోనే ఉగ్ర నిరోధక సామర్థ్యాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
PM Narendra Modi Meet
యాత్రికులే లక్ష్యంగా ఇటీవల జమ్మూ-కశ్మీర్‌లోని పర్యటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం కఠువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్‌లో ఒక ఇంటిపై దాడి జరిగింది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ అమరుడైనట్లు అధికారులు తెలిపారు. దోడా జిల్లాలోని భదర్వా-పఠాన్‌కోట్ రహదారి సమీపంలోని ఒక చెక్‌పోస్టుపై మంగళవారం జరిగిన దాడిలో… రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు సిబ్బంది, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. ఇదే జిల్లాలోని మరో ఘటనలో ఒక పోలీసు అధికారి గాయాలపాలయ్యారు.
పాకిస్థాన్ కుయుక్తులు పన్నుతోంది: డీజీపీ
జమ్మూ-కశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ కుయుక్తులు పన్నుతోందని డీజీపీ ఆర్‌ఆర్ స్వైన్ ఆరోపించారు. శత్రుమూకలకు బుద్ధి చెప్పేందుకు బలగాలు సంసిద్ధంగా ఉన్నాయని స్పష్టంచేశారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారు పశ్చాత్తాపపడతారని.. పాకిస్థానీ ఉగ్రవాదుల మాదిరి కాకుండా.. వారికి ఇక్కడ కుటుంబాలు, స్థలాలు, ఉద్యోగాలు ఉన్నాయని ‘శత్రువు ఏజెంట్ల’ను ఉద్దేశించి హెచ్చరించారు. రియాసీ జిల్లాలో భద్రత పరిస్థితులపై డీజీపీ గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పూంఛ్, రాజౌరీ ప్రాంతాలతో పోలిస్తే.. రియాసీలో ఉగ్ర ఘటనలు తక్కువ. కానీ ప్రస్తుతం అలాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు పంజా విసురుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
Also Read : Minister Komatireddy : తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా నిలబెడతాం