PM Narendra Modi: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి మూడంచెల భద్రత !
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి మూడంచెల భద్రత !
PM Narendra Modi: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ వేదికగా ఈనెల 9న ఈ నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి ‘సార్క్’ దేశాల ప్రతినిధులను దీనికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో పకడ్బందీ భద్రత ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రమాణ స్వీకార ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతకు 5 కంపెనీల పారామిలిటరీ దళాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్‌లను రంగంలోకి దించనున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఈ ప్రమాణ స్వీకారానికి బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్ తదితర దేశాలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో వారు బస చేసే ఐటీసీ మౌర్య, లీలా, తాజ్, ఒబెరాయ్ వంటి ప్రముఖ హోటళ్లను ఇప్పటికే భద్రత పరిధిలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హోటళ్ల నుంచి వేదిక వద్దకు చేరుకునేందుకు, తిరిగి వెళ్లేందుకు నిర్దేశిత మార్గాలు ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. ఎన్‌ఎస్‌జీ, దిల్లీ పోలీస్ విభాగంలోని కమాండోలను రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో, ఇతర కీలక ప్రాంతాల్లో మోహరించనున్నారు.
PM Narendra Modi – 2500 మంది పోలీసులతో భద్రతా వలయం ?
‘‘రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ప్రాంగణం లోపల, వెలుపల మూడంచెల భద్రత ఉంటుంది. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది, రాష్ట్రపతి భవన్ అంతర్గత భద్రత సిబ్బంది ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 2500 మంది పోలీసులు, అయిదు కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ సాయుధ పోలీసు (డీఏపీ) జవాన్లు విధుల్లో ఉంటారు’’ అని ఓ సీనియర్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ప్రముఖులు రాకపోకలు సాగించే మార్గాల్లో సాయుధ సిబ్బంది, స్నైపర్లు, డ్రోన్లతో నిఘా ఉంచనున్నట్లు చెప్పారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తాం : మోదీ
ఢిల్లీ మధ్య ప్రాంతానికి వెళ్లే రహదారులను ఆదివారం మూసివేసే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు ఉండొచ్చని చెప్పారు. శనివారం నుంచే దేశ రాజధాని సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయంతో… మోదీ(PM Narendra Modi) మరోసారి ప్రధాని కానున్నారు. భారత్‌కు చెందిన ‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ’తోపాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలకంగా భావించే ద్వీప దేశాలను దృష్టిలోఉంచుకుని విదేశీ అతిథుల జాబితాను రూపొందించినట్లు సమాచారం.
Also Read : Teenmar Mallanna: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం !