PM Narendra Modi: ఆరెస్సెస్ దేశ సంస్కృతి వటవృక్షం – ప్రధాని మోదీ
ఆరెస్సెస్ దేశ సంస్కృతి వటవృక్షం - ప్రధాని మోదీ
Narendra Modi : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను దేశ అజరామర సంస్కృతి, ఆధునికీకరణ వటవృక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. గత వందేళ్లలో ఆరెస్సెస్ చేసిన తపస్సు.. దేశం ‘వికసిత్ భారత్’ దిశగా సాగుతున్న తరుణంలో ఫలాలు ఇస్తోంది. రాజ్యాంగానికి 75 ఏళ్ల వేడుక వేళ.. ఆరెస్సెస్ వందేళ్లు పూర్తి చేసుకుంటోంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. దేశ చైతన్యాన్ని పరిరక్షించడమే ఆ సంస్థ ఆదర్శాలు, మౌలికసూత్రాలని పేర్కొన్నారు. నేడు మనదేశం బానిస మనస్తత్వం, బానిస చిహ్నాలను వదిలించుకుంటోందని తెలిపారు. బానిస మనస్తత్వంతో రూపొందించిన శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చామన్నారు.
PM Narendra Modi Comment About RSS
మహారాష్ట్ర నూతన సంవత్సర వేడుక గుడీ పడ్వా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఆదివారం నాగపూర్‌లో పర్యటించారు. 11 ఏళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన నాగ్‌పుర్‌లోని సంఘ్(ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆరెస్సెస్ గొప్పదనాన్ని, సంస్థ నేతల కృషిని ప్రస్తుతిస్తూ సందర్శకుల పుస్తకంలో హిందీలో భావోద్వేగపూరితంగా నోట్ రాశారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో కలిసి సంస్థ పంచాంగ కార్యక్రమం (ప్రతిపద)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లిన ప్రధాని… సంస్థ వ్యవస్థాపకుడు డా.కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, రెండో సర్‌సంఘ్‌చాలక్ ఎంఎస్ గోళ్వాల్కర్ లకు నివాళులు అర్పించారు. అనంతరం స్మృతిభవన్‌లో ఆరెస్సెస్ పదాధికారులతో భేటీ అయి వారితో గ్రూప్‌పొటో దిగారు. అదేవిధంగా మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. నాగ్‌పుర్ లోని ‘సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్’ మందుగుండు సామగ్రి కేంద్రాన్నీ సందర్శించారు.
దీక్షాభూమిలో అంబేడ్కర్ కు నివాళి అర్పించిన మోదీ
1956లో నాగపూర్ లో డా.బీఆర్ అంబేడ్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన ‘దీక్షభూమి’ని సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్యంగ నిర్మాతకు నివాళులర్పించారు. అక్కడి సందర్శకుల డైరీలో మోదీ రాశారు. భారత్ ను సమ్మిళిత, అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లడమే అంబేడ్కర్ కు అసలైన నివాళి అన్నారు.
Also Read : Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ