Poisoning Attempt: ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగానికి ప్రయత్నం ! నిందితుడు అరెస్టు !

ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగానికి ప్రయత్నం ! నిందితుడు అరెస్టు !

Poisoning Attempt : ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇచ్చోడ మండలం ధరంపూరి(Dharampuri) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(Govt School) విద్యార్థుల ప్రాణాలు తీసేందుకు కుట్ర జరిగింది. 30 మంది చిన్నారులను హతమార్చాలని చూశారు కొందరు దుర్మార్గులు… పాఠశాల వాటర్ ట్యాంక్‌ లో పురుగులమందు కలిపి విష ప్రయోగం చేశారు. అంతేకాదు మధ్యాహ్న భోజనం వండే పాత్రలపైనా విషం చల్లారు. అయితే పాఠశాల సిబ్బంది అప్రమత్తం కాడవంతో పెను ప్రమాదం తప్పింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Poisoning Attempt on Govt School

శనివారం, ఆదివారం, సోమవారం వరసగా మూడు రోజులపాటు పాఠశాలకు సెలవులు వచ్చాయి. దీనితో పాఠశాల అన్ని గదులు సహా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండే పాత్రలు ఉన్న గదికి సైతం తాళాలు వేశారు సిబ్బంది. అయితే మంగళవారం స్కూల్ రీ ఓపెన్ కాగా… భోజనం వండేందుకు మధ్యాహ్న భోజన కార్మికులు వంట పాత్రలు శుభ్రం చేసేందుకు బయటకు తీశారు. ఈ క్రమంలో దుర్వాసన, నీళ్లతో కడుతుంటే నురగ వచ్చింది. అప్రమత్తమైన కార్మికులు విషయాన్ని వెంటనే ప్రధానోపాధ్యాయుడు, టీచర్లకు తెలియజేశారు. దీనితో వారంతా పాఠశాల ఆవరణను తనిఖీ చేయగా… పురుగులమందు డబ్బాలు దర్శనమిచ్చాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడిన పాఠశాల సిబ్బంది మరింతగా తనిఖీ చేశారు. ఈ మేరకు వాటర్ ట్యాంక్‌ లోనూ పురుగులమందు కలిపినట్లు గుర్తించారు. దీనితో విద్యార్థులను మంచినీరు తాగొద్దని హెచ్చరించారు. పోలీసులకు వెంటనే సమాచారం అందించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. విషం డబ్బాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ విషయం కాస్త విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులతో కలిసి స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమ పిల్లలు భోజనం చేసినా, మంచినీరు తాగినా ప్రాణాలు కోల్పోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అభంశుభం తెలియని చిన్నారులను చంపేందుకు కుట్రలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, విద్యార్థులను చంపేందుకు విషం కలిపిన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

24 గంటల్లో నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

ఆదిలాబాద్‌(Adilabad) జిల్లా ఇచ్చోడలోని ప్రభుత్వ పాఠశాల వంట గదిలోని నీటిలో పురుగుల మందు కలిపిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాల కారణంగానే నిందితుడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహాజన్ మాట్లాడుతూ… ఈ నెల 13, 14వ తేదీల్లో సెలవు కావడంతో ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మూసివేశారు.

మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చి చూసేసరికి స్కూల్‌ వంటగదికి వేసిన తాళం పగలగొట్టి ఉండటాన్ని అక్కడి ఉపాధ్యాయురాలు, సిబ్బంది గమనించారు. వంటగదిలో ఉన్న ఒక బకెట్‌లో నీరు తెలుపు రంగులో ఉండటాన్ని వారు గమనించారు. అక్కడి పాత్రలను చూసి అనుమానం వచ్చిన టీచర్‌ ప్రతిభ… వెంటనే గ్రామ సర్పంచి, స్థానిక పెద్దలకు సమాచారం ఇచ్చారు. వారు పాఠశాలకు వచ్చి పరిశీలించగా… నీటిలో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. ఉపాధ్యాయురాలు ప్రతిభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌ సింగ్‌, ఇచ్చోడ సీఐ భీమేశ్‌ పాఠశాలను పరిశీలించి వివరాలు సేకరించారు. ధర్మపురికి చెందిన వ్యక్తిపై అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు.

ధర్మపురి(Dharampuri) గ్రామానికి చెందిన సోయం కిస్టును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. తానే పురుగుల మందు కలిపినట్లు అంగీకరించాడు. నిర్మల్‌లో ఉన్న తన సోదరుడి ఇంటి నుంచి పురుగుల మందు తీసుకొచ్చి… పాఠశాల వంట గది తాళాన్ని పగలగొట్టి నీటిలో కలిపినట్లు అంగీకరించాడు. కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా నిందితుడు మానసికంగా ఇబ్బందిపడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించాం. తన ఇంట్లో వారిపై ఉన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేశాం. అతనిపై 329(4), 324(6), 331(8), 332 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’’ అని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటన వల్ల పాఠశాల విద్యార్థులకు ఎలాంటి అపాయం జరగలేదని ఎస్పీ తెలిపారు.

Also Read : Supreme Court: బాలల అక్రమ రవాణా కేసు నిందితులపై సుప్రీకోర్టు ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!