Prashant Kishor: వైసీపీ ఓటమి ఖాయం ! ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు !
వైసీపీ ఓటమి ఖాయం ! ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు !
Prashant Kishor: రానున్న ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఓటమి ఖాయమని ఎన్నికల వ్యూహకరత్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అప్పులు చేసి సంక్షేమాన్ని అందిస్తున్న జగన్… రాష్ట్రాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఈజ్ లూసింగ్ బిగ్ అంటూ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ లో ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ అనే జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈ కథనాన్ని ఇంకా అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గాని, పత్రికలో ప్రచురించడం కాని చేయలేదు. అయినప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులు పీకే వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు.
Prashant Kishor Survey
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) సిద్ధంగా ఉన్నాడంటూ ట్వీట్ చేసారు. మరో మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ… టీడీపీ, జనసేన ఓడిపోతాయని ప్రజల గట్ ఫీలింగ్. చంద్రబాబును బహిరంగంగా ప్రశాంత్ కిషోర్ కలిసిన తరువాత ఇలా మాట్లాడటం వెనుక అతని ఆంతర్యం అర్ధమౌతోంది అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఐ ప్యాక్ టీంతో లేడు. అతను పూర్తిగా రాజకీయ నాయకుడు. బీహార్ లో చెల్లని రూపాయిగా మారాడు. అతని మాయల ఫకీరు మాటలు ఎవరూ నమ్మరు. బీహార్ లో పీకే పరిస్థితిలాగే ఏపీలో చంద్రబాబు పరిస్థితి కూడా తయారైయింది. ఒక పీకే (పవన్ కళ్యాణ్) సరిపోవడం లేదని రెండో పీకే (ప్రశాంత్ కిషోర్) ను కూడా చంద్రబాబు తెచ్చుకున్నారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివరకు గెలిచేది జగన్ అని మంత్రి అమర్ నాథ్ అన్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసారు. మహా సంకల్ప పాదయాత్రకు ముందు నిర్వహించిన బహిరంగ సభలో ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ నాయకులు, కార్యకర్తలకు జగన్ పరిచయం చేసారు. వైసీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఇంట జరిగిన ఓ వివాహానికి సతీ సమేతంగా జగన్ హాజరయ్యారు. 2019 ఎన్నికల తరువాత కూడా ఐ ప్యాక్ టీంను తన ఎన్నికల కార్యకలాపాలకు జగన్ ఉపయోగిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ బీహార్ లోని ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన తరువాత… ఐ ప్యాక్ టీం ను రిషి రాజ్ సింగ్ నడుపుతున్నట్లు… ఈ నేపథ్యంలో జగన్ కు పీకేకు చాలా గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగింది.
ఇంతలోనే ఓ రెండు నెలల క్రితం ప్రశాంత్ కిషోర్… నారా లోకేష్ తో కలిసి విజయవాడ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షం కావడం… ఇద్దరూ కలిసి చంద్రబాబు ఇంటికి వెళ్ళి భేటీ కావడం జరిగింది. దీనితో ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) పై వైసీపీ నాయకులు, అనుంబంధ మీడియా బీహారీ గజదొంగతో చంద్రబాబు చెట్టాపట్టాల్ అంటూ కథనాలు కూడా ప్రచురించింది. ఇలాంటి సమయంలో వైసీపీ ఓటమి ఖాయమంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
Also Read : Soyam Bapu Rao: బీజేపీ అగ్రనేతలపై సోయం బాపురావు సంచలన కామెంట్స్ !