Pulivendula ZPTC: పులివెందుల, ఒంటిమిట్టలో ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌

పులివెందుల, ఒంటిమిట్టలో ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌

Pulivendula : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతించారు. రెండు చోట్లా 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు టీడీపీ (TDP), వైసీపీ మధ్యే జరిగింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి.. ఒంటిమిట్టలో ముద్దు కృష్ణారెడ్డి (టీడీపీ), ఇరగం రెడ్డి (వైసీపీ) తలపడ్డారు. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ నిర్వహించారు.

Pulivendula – పులివెందులలో భారీ రిగ్గింగ్‌ జరిగింది – ఎంపీ అవినాష్ రెడ్డి

వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ రిర్గింగ్‌ జరిగిందని ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు, టీడీపీ గూండాలు కలిసి రిగ్గింగ్‌ లకు పాల్పడ్డారన్నారు. తమ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌లో లేకుండా చేశారని, బయట నుంచి వేలాది మంది టీడీపీ గూండాలను తెచ్చారన్నారు. ఈ ఉప ఎన్నికలను బర్త్ రఫ్‌ చేయాలని అవినాష్‌ డిమాండ్‌ చేశారు. పులివెందుల ఉప ఎన్నికలో భాగంగా అచ్చివెల్లి గ్రామస్తులు ఎంపీ అవినాష్‌రెడ్డిని కలిశారు. తమను ఓటువు వేయనీయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారని, ఏజెంట్లుగా కూర్చున్న మహిళలను బెదిరించారన్నారు. కత్తులు, కర్రలతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారని, పోలింగ్‌ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లు వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారన్నారు. వచ్చిన వారంతా ఇతర ప్రాంతాల నుంచి తమ గ్రామంలోకి వచ్చిన వారేని వారు ఎంపీ అవినాష్‌కు తెలిపారు.

ఒంటిమిట్టలో రిగ్గింగ్‌ పై ఈసీకి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్ధి ఫిర్యాదు

పులివెందుల (Pulivendula),ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా అధికార పార్టీ వ్యవహరించిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అధికార బలాన్ని అడ్డంపెట్టుకొని పోలింగ్‌ బూత్‌ లలోనే దొంగ ఓట్లు వేయించినట్లు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో జడ్పీటీసీ ఉప ఎన్నికపై ఒంటిమిట్ట వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్ధి సుబ్బారెడ్డి ఎన్నికల అధికారులను ఆశ్రయించారు. 17బూత్‌లకు రీపోలింగ్‌ జరపాలని కోరారు. ఈ మేరకు ఎలక్షన్‌ రిటర్నింగ్‌ అధికారికి ఓబులమ్మకు ఫిర్యాదు చేశారు. మొత్తం 30 బూత్‌లకు 17బూత్‌లలో రీపోలింగ్‌ జరపాలని విజ్ఞప్తి చేశారు.

వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని రుజువైంది – మంత్రి నారా లోకేష్

పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిగన నేపథ్యంలో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా పులివెందుల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం… అంతేకానీ భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదని వైసీపీ అగ్రనాయకత్వానికి మంత్రి నారా లోకేష్ చురకలంటించారు.

Also Read : AP Government: ఏపీలో మరో 31 నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

Leave A Reply

Your Email Id will not be published!