Punjab: భారీ వర్షాలకు భూమిలో కూరుకుపోయిన 60 బైకులు

భారీ వర్షాలకు భూమిలో కూరుకుపోయిన 60 బైకులు

Punjab : భారీ వర్షాలతోపాటు ఎగువ నుంచి వచ్చిన నీటి ప్రవాహంతో రావి నదికి వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని రావి నది పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికి వచ్చిన పంటలు పోయి వారు ఆందోళన చెందుతుంటే… మరోవైపు వారికి ఇంకో సమస్య వచ్చిపడింది. ఈ ప్రాంతంలోని ఉస్ పార్ గ్రామాల్లోని రైతులకు చెందిన దాదాపు 60 బైకులు భూమిలోకి దిగబడి పోయాయి. అది కూడా ఆరు నుంచి ఎనిమిది అడుగులు లోతులోకి వెళ్లిపోయాయి. తొలుత తమ బైకులు పార్క్ చేసిన ప్రాంతంలో అవి కనిపించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే కొన్ని బైకులకు భూమిలోకి చొచ్చుకు వెళ్లినట్లు వారు గుర్తించారు. దీంతో రైతులు బృందాలుగా ఏర్పడి.. వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. దాదాపుగా ఆ ప్రాంతాలోని రైతులంతా తమ తమ వాహనాలను వెలికి తీసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అందుకోసం వారంతా తవ్వకాలు చేపట్టారు.

Punjab Floods Sensational

ఈ ఉస్ పార్.. ఏడు గ్రామాల సమూహం. ఈ గ్రామాల్లో దాదాపు నాలుగు వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం పాకిస్థాన్‌ సరిహద్దులకు అనుకుని ఉంది. అయితే తామంతా బ్యాంకు లోన్ ద్వారా ఈ వాహనాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. మరో వైపు పంట మొత్తం పోవడం… అలాగే బైకులు సైతం ఇలా భూమిలో కూరుకు పోవడంతో ఆ రైతుల బాధను వర్ణించ లేని పరిస్థితి నెలకొంది. తీసుకున్న లోన్‌కు నగదుతోపాటు వడ్డి చెల్లించకుంటే.. సిబిల్ స్కోర్ పడిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తీసుకున్న ఈ లోన్ చెల్లించకుంటే.. మళ్లీ పంటకు రుణం తీసుకునే వెసులుబాటు లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరదల కారణంగా తమ పశువులు సైతం మృతి చెందాయని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Punjab – పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ లో సీఎం భగవంత్‌ మాన్‌ పర్యటన

పంజాబ్‌లో (Punjab) సట్లెజ్, బియాస్, రావి నదులతో పాటు చిన్నచిన్న వాగులూ వంకలూ పొంగి ప్రవహిస్తుండటంతో 12 జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 1988 తర్వాత సంభవించిన అతిదారుణ వరదలు ఇవేనని అధికారులు అంటున్నారు. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో కుండపోత కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. గురుదాస్‌పుర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, కపూర్థలా, తరన్‌తారన్, ఫిరోజ్‌పుర్, హోశియార్‌పుర్, అమృత్‌సర్‌ జిల్లాలను వరద ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. చైనా పర్యటన నుంచి తిరిగివచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్‌ (Punjab) ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు ఫోన్‌చేసి పరిస్థితి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో ‘జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం’ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), సైన్యం, సరిహద్దు భద్రతాదళం పాల్గొంటున్నాయి. విద్యా సంస్థలకు బుధవారం వరకూ సెలవు ప్రకటించారు.

హిమాచల్‌ ను వణికిస్తున్న వరదలు

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీవర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. ఆరు జాతీయ రహదారులతో సహా 1,337 రోడ్లపై రాకపోకల్ని నిలిపివేశారు. రూ.3,158 కోట్ల నష్టం వాటిల్లిందని అధికార వర్గాలు తెలిపాయి.

Also Read : AAI Senior Manager: ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ‘లక్కీ భాస్కర్’ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!