Rahul Gandhi: సీబీఐ కొత్త చీఫ్ ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
సీబీఐ కొత్త చీఫ్ ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Rahul Gandhi : లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం ప్రధాని కార్యాలయానికి (పీఎంవో) వెళ్లారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త చీఫ్ని ఎంపిక చేసేందుకు నిర్వహించిన భేటీలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని కార్యాలయంలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీ సమావేశానికి రాహుల్ తో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా హాజరయ్యారు. అటు, పహల్గాం దాడికి సంబంధించి పాకిస్థాన్ తో అనుసరించాల్సిన విషయాలపై కూడా వీరిద్ధరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. వీటితో పాటు పలు కీలక అంశాలు కూడా ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం మే 25న ముగియనున్న తరుణంలో కొత్త చీఫ్ ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల నియామక కమిటీలో లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్ నియామకాన్ని చేపడుతుంది.
Rahul Gandhi – సుంకాలపై ట్రంప్ తో భారత్ చర్చలు జరపాలి – రాహుల్
సుంకాల విధానంలో మార్పులు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలకు సుముఖంగా ఉన్నారని, భారత్ వెంటనే ఆయనతో చర్చలు జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సూచించారు. ప్రయోజనకరమైన ఒప్పందాన్ని కుదుర్చుకొనే సామర్థ్యం మన దేశానికి ఉందని ఆయన అన్నారు. ఏప్రిల్ 21న అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ‘వాట్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్’లో నిర్వహించిన సదస్సులో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను వాట్సన్ ఇనిస్టిట్యూట్ తన యూట్యూబ్ ఛానెల్లో శనివారం పోస్టు చేసింది. అందులోని కొంత భాగాన్ని రాహుల్ సోమవారం ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో రాహుల్ మాట్లాడుతూ…‘‘నేడు భారత్ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ చైనాతో పోటీగా ఉత్పత్తి, తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడం, ఉద్యోగాలను సృష్టించడం. కానీ సరళీకృత ఆర్థిక వ్యవస్థ లేకుండా ఇవన్నీ సాధించలేం. సంపద సృష్టికి ఏకైక మార్గం ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడమే’’ అని రాహుల్ స్పష్టం చేశారు. ‘‘మన దేశానికి ఉన్న బలాలేంటి, మనకేం కావాలి అనే విషయాలను మనం అర్థం చేసుకోవాలి. మనకు నష్టం చేసే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. ఉత్పత్తి రంగంలో భారత్-అమెరికా మధ్య భాగస్వామ్యం, ప్రజాస్వామ్య వాతావరణంలో ఉత్పత్తిపై వ్యూహాన్ని రూపొందించడం అత్యవసర.’’ అని రాహుల్ పేర్కొన్నారు.
Also Read : India: చీనాబ్ నదిపై రెండు డ్యామ్ల నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్న భారత్