Rahul Gandhi: బీజేపీ, ఈసీలపై రాహుల్ సంచలన ఆరోపణలు
బీజేపీ, ఈసీలపై రాహుల్ సంచలన ఆరోపణలు
Rahul Gandhi : కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, ఈసీ కుమ్మకై ఎన్నికల్లో ‘భారీ నేరపూరిత మోసానికి’ పాల్పడ్డాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇది రాజ్యాంగ ద్రోహమని విమర్శించారు. ‘ఓట్ల చోరీ విధానం’ దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో కొనసాగిందన్నారు. ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలపై తమ పార్టీ విశ్లేషణపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఎన్నికల ఫలితం చోరీకి గురైందన్న కాంగ్రెస్ అనుమానాలను గతేడాది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ధ్రువీకరించాయన్నారు. తమ పార్టీ పరిశోధించి ఆధారాలు సేకరించిందని, దేశవ్యాప్తంగా అటువంటి ఆధారాలను తుడిచిపెట్టే యత్నాల్లో ఈసీ తలమునకలై ఉందని ఆరోపించారు.
Rahul Gandhi – లక్ష ఓట్ల దోపిడీ ?
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మహాదేవపుర శాసనసభ స్థానానికి చెందిన ఓటర్ల జాబితాను తమ పార్టీ విశ్లేషించిందని రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా 1,00,250 ఓట్లు చోరీకి గురైనట్లు తేలిందన్నారు. ‘‘ఈ నియోజకవర్గంలో 11,965 డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. 40,009 మంది తప్పుడు చిరునామాలు సమర్పించారు. 10,452 మంది ఒకే చిరునామాలో ఉన్నారు. 4,132 మంది ఓటర్లవి తప్పుడు ఫొటోలున్నాయి. 33,692 మంది ఫారం-6ను దుర్వినియోగం చేశారు’’ అని రాహుల్ (Rahul Gandhi) ఆరోపించారు.
ప్రజాస్వామ్యంపై అణుబాంబు దాడి – రాహుల్
‘‘ఓట్ల చోరీ అనేది మన ప్రజాస్వామ్యంపై అణుబాంబు దాడి’’ అని ‘ఎక్స్’లో రాహుల్ పేర్కొన్నారు. ఈ అక్రమాన్ని నిరసిస్తూ శుక్రవారం బెంగళూరులోని ఫ్రీడంపార్క్ వద్ద తమ పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించనుందని వెల్లడించారు. ‘‘దేశవ్యాప్తంగా భారీ నేరపూరిత మోసం జరిగిందన్న విషయం ప్రజలంతా తెలుసుకోవాలి. ఈసీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కలిసి ఈ అక్రమానికి పాల్పడ్డాయి. ఇందుకు సంబంధించిన విస్పష్టమైన, సందేహంలేని ఆధారాలను మేం వెలుగులోకి తీసుకొచ్చాం. ఎన్నికల చోరీ విధానం, అక్రమాల ఆధారాలపై పౌరులందరూ దృష్టిసారించాలి’’ అని పేర్కొన్నారు. మెజారిటీ కొరవడిన ప్రధాని మంత్రి మోదీ అధికారంలో కొనసాగేందుకు 25 లోక్‌సభ స్థానాలను తస్కరించాల్సిన అవసరం ఏర్పడగా.. భాజపా ఆ స్థానాలను కేవలం 33 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం గమనించాలని రాహుల్ వ్యాఖ్యానించారు. గత 15 ఏళ్ల ఎన్నికల డేటా, సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వకపోతే ఈసీ నేరానికి పాల్పడినట్టేనని అన్నారు. కాగా, తన నివాసంలో గురువారం రాత్రి జరిగిన విందు సమావేశంలోనూ రాహుల్ ఓట్ల విశ్లేషణ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సుమారు 50 మంది నేతలు హాజరయ్యారు.
ఆ ఓటర్ల వివరాలివ్వండి – ఈసీ
రాహుల్ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) కార్యాలయాలు స్పందించాయి. జాబితాల్లో అక్రమంగా చేర్చారన్న, తొలగించారన్న ఓటర్ల పేర్లతో వివరాలను సంతకం చేసిన డిక్లరేషన్ రూపంలో అందజేస్తే, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపాయి.
ప్రజలు ఆదరించకపోవడంతోనే రాహుల్ వ్యాఖ్యలు – బీజేపీ
ఎన్నికల సంఘంపై రాహుల్ ఆరోపణలు ఉద్దేశపూర్వక వంచన అని బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించకపోవడంతో నిరాశ, కోపానికి గురై ఈసీపై ఆరోపణలకు దిగుతున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.
Also Read : US Green Card: 20 వేల డాలర్లకు అమెరికా గ్రీన్‌కార్డు !
