Ratan Mohini Dadi: బ్రహ్మకుమారీస్ ‘రతన్ మోహిని దాదీ’ మృతి
బ్రహ్మకుమారీస్ ‘రతన్ మోహిని దాదీ’ మృతి
Ratan Mohini Dadi : ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి ‘రాజయోగిని’ రతన్ మోహిని దాదీ అహ్మదాబాద్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 101 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారని, రాజస్థాన్ లోని మౌంట్ ఆబూలో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి పార్థివ దేహాన్ని తీసుకురానున్నట్లు బ్రహ్మకుమారీలు ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 10న అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
దాదీ రతన్ మోహిని(Ratan Mohini Dadi) అసలు పేరు లక్ష్మి. ప్రస్తుత పాకిస్థాన్ లోని హైదరాబాద్‌లో 1925లో జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే బ్రహ్మకుమారీల్లో చేరి ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. దేశ విభజన సమయంలో రాజస్థాన్ కు వచ్చారు. ఆమె పలు సందర్భాల్లో మొత్తం 70 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. బ్రహ్మకుమారీల శిక్షణ కేంద్ర నిర్వాహకురాలిగా దేశవ్యాప్తంగా ఉన్న 4,600 కేంద్రాల్లో సుమారు 46 వేల మంది బ్రహ్మకుమారీలను తీర్చిదిద్దారు.
Ratan Mohini Dadi – రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎంల సంతాపం
రతన్ మోహిని దాదీ మరణంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘బ్రహ్మకుమారీల సంస్థకు చుక్కాని లాంటి దాదీ తన బోధనలు, కార్యక్రమాల ద్వారా అసంఖ్యాకమైన ప్రజల జీవితాలను తీర్చిదిద్దారు’’ అని విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ‘ఎక్స్’ ద్వారా తన సంతాప సందేశంలో తెలిపారు.
‘‘అత్యున్నతమైన ఆధ్యాత్మిక మార్గంలో పయనించిన దాదీ జ్ఞానం, కరుణతో కూడిన దీప స్తంభంగా గుర్తుండిపోతారు’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సైతం సంతాపం వ్యక్తం చేశారు. ‘‘దాదీ మరణం ఆధ్యాత్మిక సేవారంగానికి అపార నష్టం. ఉన్నత ఆదర్శాలపై అచంచల నిబద్ధత కనబరుస్తూ… సామాజిక పరివర్తనను తీసుకురావడానికి దాదీజీ కృషి చేశారు’’ అని గవర్నర్ తెలిపారు. ‘‘దాదీజీ జీవితం అందరికీ ఆదర్శం. ఆధ్యాత్మిక బలానికి, నిర్మలత్వానికి, విశ్వ సోదరభావానికి ఆమె నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
Also Read : Constable Yashoda Das: ఒడిశా జైలులో కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి