ప్రపంచంలో అతిపెద్ద ఉద్యాన క్లస్టర్ గా రాయలసీమ
ప్రకటించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : ప్రపంచంలో అతిపెద్ద ఉద్యాన క్లస్టర్ గా రాయలసీమ మారబోతోందని ప్రకటించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. అమరావతి లోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు అపారంగా పెరిగే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. మొత్తం 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లు, 303 మండలాల్లో ఉద్యాన పంటలను అభివృద్ధి చేసేలా ప్రతిపాదించినట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని మూడేళ్లల్లో 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు విస్తరించేలా ప్రణాళికలు చేపట్టినట్టు పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతం ఉద్యాన ఉత్పత్తుల విషయంలో దేశంలోనే అగ్ర స్థానంలో ఉందన్నారు. . ప్రపంచంలోనే అతిపెద్ద క్లస్టర్ గా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారని చెప్పారు.
దుబాయికి చెందిన డీపీ వరల్డ్ సంస్థ ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి సమావేశంలో వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో రాయలసీమ ప్రాంతం ఉద్యాన రంగంలో అభివృద్ధి చెందడానికి ఆస్కారం మెండుగా కన్పిస్తోందని.. దీనికి అనుగుణంగా ఎకో సిస్టం డెవలప్ అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. దీంట్లో భాగంగా అంతర్జాతీయ విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అలాగే స్థానికంగా ఉద్యాన రంగ అభివృద్ధికి అవసరమైన రూరల్ రోడ్ నెట్ వర్క్, లాజిస్టిక్స్, మార్కెట్ కనెక్టివిటీ, గ్లోబల్ కనెక్టివిటీ వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పూర్వోదయ ద్వారా వచ్చే నిధులతో పాటు ఉద్యాన రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను సాధించాలని స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పోర్ట్ కనెక్టివిటీ, గోదాములు, కోల్డ్ చైన్ తదితర లాజిస్టిక్స్ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్ సహా ఆర్థిక, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన, పోర్టులు, ఆర్ అండ్ బి శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
