Arvind Kejriwal : ప్రధాన రాజకీయ పార్టీలకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చిన ఘనత ఆమ్ ఆద్మీ పార్టీదే. ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మ్యాజిక్ కు జనం ఫిదా అయ్యారు.
గంప గుత్తగా పట్టం కట్టారు. 117 సీట్లు కలిగిన పంజాబ్ లో అధికార ప్రభుత్వాన్ని నిలదీయడంలో,
ప్రశ్నించడంలో, ప్రజల వైపు ఉండడంలో కేజ్రీవాల్(Arvind Kejriwal ) సక్సెస్ కాగలిగారు.
పాలకుల వైఫల్యాలను ఎండగట్టారు. ఎందుకు పంజాబ్ నష్ట పోయిందో చెప్పారు. తమకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని కోరాడు.
ఆ మంత్రం పని చేసింది. సీట్లు కొల్లగొట్టేలా చేసింది.
పవర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తనంతకు తాను వచ్చిన అరుదైన అవకాశాన్ని చేజేతులారా చేజార్చుకుంది.
అంది వచ్చిన అన్ని అవకాశాలను కాదనుకుంది. చివరకు ఓటమిని మూటగట్టుకుంది.
కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు ఆ పార్టీని భ్రష్టు పట్టించేలా చేసింది.
రాహుల్, ప్రియాంక గాంధీ చరిష్మా పని చేయలేదు. సిద్దూ మాటల మంత్రం వర్కవుట్ కాలేదు.
పార్టీ అనుకున్నట్లు దళిత కార్డు దరిదాపుల్లోకి రాలేదు. ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ ను తిరస్కరించారు.
ఆప్ ను ఆదరించారు. లాండ్ సాండ్ మాఫియాను కళ్లకు కట్టినట్లు చూపించడంలో కేజ్రీవాల్(Arvind Kejriwal) ముందంజలో నిలిచారు.
ఆయన ప్రధానంగా సిద్దూ, చన్నీలను టార్గెట్ చేశారు. అంతే కాదు ఆప్ పై ఎన్ని ఆరోపణలు చేసినా చివరకు కాంగ్రెస్ కే దెబ్బ పడింది.
గత కొంత కాలంగా సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగిన శిరోమణి అకాలీదళ్ ను కూడా జనం పట్టించుకోలేదు.
ఏక్ మౌకా కేజ్రీవాల్ ఏక్ మౌకా భగవంత్ మాన్ కు దేదో అన్న నినాదం సూపర్ ఫాస్ట్ గా జనాన్ని ప్రభావితం చేసింది. అదే ఆప్ కు పవర్ దక్కేలా చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో అమలు చేస్తున్న పారదర్శక పాలనే ఇక్కడ కూడా అమలు చేస్తామని ప్రజల సాక్షిగా ప్రకటించారు కేజ్రీవాల్. ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆచరణకు నోచుకునే హామీలు ఇచ్చారు.
ముందుగానే సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ను ప్రకటించారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు..ఈ విజయం పూర్తిగా కేజ్రీవాల్ సాధించిన కష్టమే అని చెప్పక తప్పదు.
Also Read : ఎన్నికల ఫలితాలపై మోదీ మార్క్