Reserve Bank of India: ఏపీ రాజధానిపై ఆర్బీఐ స్పందన !
ఏపీ రాజధానిపై ఆర్బీఐ స్పందన !
Reserve Bank of India: ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వలనే ఆర్బీఐ(RBI) కార్యాలయం ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ జనరల్ మేనేజర్ సమిత్ తెలిపారు. అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై గుంటూరుకు చెందిన జాస్తి వీరాంజనేయులు 2023లో ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖపై ఆయన ఎట్టకేలకు వివరణ ఇచ్చారు. దీనితో మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధాని విషయం మరోసారి వెలుగులోనికి వచ్చింది.
Reserve Bank of India Comment
2023లో ఏపీలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై అఖిలభారత పంచాయతీ పరిషత్ ఏపీ అధ్యక్షుడి హోదాలో గుంటూరుకు చెందిన జాస్తి వీరాంజనేయులు ప్రధాని కార్యాలయానికి ఓ లేఖ రాసారు. అయితే ఆయన రాసిన లేఖను… ప్రధాని కార్యాలయం ఆర్బీఐకి పంపించింది. దీనితో రిజర్వు బ్యాంకు అధికారులు ఆ లేఖకు సమాధానమిచ్చారు. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం తేల్చనందునే కార్యాలయం ఏర్పాటు చేయలేదని వీరాంజనేయులుకు ఆర్బీఐ లేఖ పంపింది. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆర్బీఐ అధికారులు అందులో సమాధానమిచ్చారు. దీనిపై జాస్తి వీరాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘2016లోనే అమరావతిలో ఆర్బీఐకి అప్పటి టీడీపీ ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించింది. కేంద్రప్రభుత్వ మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించింది. పార్లమెంట్ సాక్షిగా కూడా అమరావతి రాజధాని అని ప్రకటించింది. అయినా ఆర్బీఐ అధికారులు ఏపీ రాజధాని ఏదో తెలియదన్నట్టు సమాధానమివ్వడం దారుణం’’ అని వ్యాఖ్యానించారు.
Also Read : Janasena Star Campaigners: స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన జనసేన పార్టీ !