Sadhguru Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ !
సద్గురు జగ్గీ వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ !
Sadhguru Jaggi Vasudev: ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక ప్రవచన కర్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కు న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ జరిగింది. గత నాలుగు వారాల నుంచి తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న సద్గురుకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించగా… మెదడులో భారీ రక్తస్రావంతో పాటు వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా ఆయనకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన బ్రెయిన్ సర్జరీ చేశామని… ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యిందని అపోలో వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సద్గురు ఆసుపత్రిలో పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటున్నారని స్పష్టం చేశారు.
Sadhguru Jaggi Vasudev Health Updates
అపోలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరి ఈ సర్జరీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. తీవ్ర తలనొప్పితో ఆయన ఆసుపత్రికి వచ్చినప్పుడు తాము CT-స్కాన్ నిర్వహించామని… రిపోర్ట్‌లో సద్గురు మెదడులో రక్తస్రావంతో పాటు వాపు ఉన్నట్లు తేలిందని చెప్పారు. తన రోజువారి కార్యకలాపాల్లో తలనొప్పి సమస్యను సద్గురు(Sadhguru Jaggi Vasudev) పెద్దగా పట్టించుకోలేదని… అయితే మార్చి 15న నొప్పి మరింత తీవ్రమవ్వడంతో తనని సంప్రదించారని అన్నారు. అప్పుడే ఏదో చెడు జరుగుతోందన్న విషయాన్ని తాను గ్రహించానన్నారు. మార్చి 17న సద్గురు నాడీ సంబంధిత స్థితి వేగంగా క్షీణించిందని… దీనితో ఆయనకు వాంతులు అయ్యాయని చెప్పారు. అప్పుడు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వగా… మరోసారి CT-స్కాన్ చేశామన్నారు.
ఆ రిపోర్ట్ ఆధారంగా సద్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారన్న విషయం తేలిందని… దీనితో కొన్ని గంటల్లోనే ఆయనకు మెదడుకు శస్త్రచికిత్స చేశామని డాక్టర్ వినిత్ సూరి వెల్లడించారు. ఆ సర్జరీని వినిత్ సూరి, ప్రణవ్ కుమార్, సుధీర్ త్యాగి, ఎస్ ఛటర్జీ నేతృత్వంలోని వైద్యుల బృందంలో నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని… మెదడు, శరీరం, వైటల్ పారామీటర్స్ సాధారణ స్థితికి చేరుకున్నాయని చెప్పారు. తాము ఊహించిన దానికంటే వేగంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. మరోవైపు… అపోలో ఆసుపత్రిలోని న్యూరో సర్జర్లు తన పుర్రెను కోసి ఏదో శోధించేందుకు ప్రయత్నించారని, కానీ వాళ్లు ఏమీ కనుగొనలేకపోయారంటూ సర్జరీ అనంతరం సద్గురు ఛలోక్తులు పేల్చారు.
Also Read : Supreme Court : ఇన్వెస్టిగేషన్ లేకుండా కోర్టులో హాజరు పరచడంపై ఈడిని నిలదీసిన ధర్మాసనం