HCA Scam: హెచ్‌సీఏ స్కామ్‌లో జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ అరెస్ట్

హెచ్‌సీఏ స్కామ్‌లో జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ అరెస్ట్

HCA Scam : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో శుక్రవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సంస్ధ జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ను సీఐడీపోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మహారాష్ట్రలోని పుణెలో దేవరాజును ‌అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని హైదరాబాద్ తీసుకువచ్చి.. మల్కాజ్‌గిరి కోర్టులో హాజరుపరిచారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై కేసు నమోదైన.. దాదాపు 17 రోజుల అనంతరం సీఐడీ పోలీసులకు దేవరాజు చిక్కారు. ఈ 17 రోజుల్లో దాదాపు 7 రాష్ట్రాల్లో దేవరాజు పర్యటించినట్లు ఈ సందర్భంగా పోలీసులు గుర్తించారు.

అయితే దేవరాజును గాలించేందుకు 6 ప్రత్యేక బృందాలను సీఐడీ అధికారులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో కుంభకోణం (HCA Scam) వెలుగులోకి రాగానే.. ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ సమాచారంతో సీఐడీ నుంచి దేవరాజు తప్పించుకున్న విషయం విదితమే. దీంతో ఆయనను పట్టుకునేందుకు సీఐడీ బృందాలు.. ఈ 17 రోజుల్లో 7 రాష్ట్రాలు తిరిగాయి. చివరకు పుణెలో దేవరాజు‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ అధికారులు దాదాపు 36 గంటల పాటు నిర్విరామంగా పని చేసి.. పుణెలో దేవరాజును అరెస్ట్ చేశారు.

సీఐడీ నుంచి దేవరాజు తప్పించుకున్న తర్వాత.. హైదరాబాద్‌, భద్రాచలం, కాకినాడ, వైజాగ్‌, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపురం, బెంగళూరు, గోవా, పుణె, ఊటీ, యానాం తదితర ప్రదేశాల్లో దేవరాజు పర్యటించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో సీఐడీ అధికారులు దేవరాజును పట్టుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కుంభకోణంలో దేవరాజు ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే.

HCA Scam – ఇంతకీ ఏం జరిగిందంటే ?

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో (HCA) భారీగా అవకతవకలు జరిగినట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. అందులోభాగంగా హెచ్‌సీఐ అధ్యక్షుడితోపాటు మరో ఐదుగురిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో వారిని అరెస్ట్ చేశారు. అయితే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయనున్నారంటూ హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌కు ముందుస్తుగా ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి సమాచారం అందించారు. దీంతో దేవరాజ్ పరారయ్యారు. దీంతో ఐదుగురిని మాత్రమే సీఐడీ అరెస్ట్ చేసింది. దేవరాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు.. దేవరాజ్ పరారయ్యేందుకు సహకరించిన ఉప్పల్ సీఐపై పోలీస్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

HCA అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు మల్కాజ్‌గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ ఇచ్చింది. మరోవైపు, జగన్మోహన్‌రావును మరోసారి కస్టడీకి ఇవ్వాలని వేసిన CID పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జగన్మోహన్‌రావు, సునీల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు వింటామని కోర్టు పేర్కొంది.

ఇలా ఉండగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ కు సంబంధించి సీఐడీ కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. సమ్మర్ క్యాంప్‌ల పేరుతో రూ.4 కోట్లు కాజేసినట్టు తెలుస్తోంది. HCA ప్రెసిడెంట్ జగన్మోహన్‌రావు అండ్ కో, గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించింది. ప్రతీ క్యాంప్‌లో 100 మందికి చొప్పున 2,500 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో HCA కార్యకలాపాల పర్యవేక్షణకు జస్టిస్‌ నవీన్‌రావు హైకోర్టు నియమించింది.

Also Read : KTR: సీఎం రేవంత్‌ పై కేటీఆర్‌ సెటైర్లు

Leave A Reply

Your Email Id will not be published!