Shubhanshu Shukla: భూమిపైకి సురక్షితంగా చేరుకున్న శుభాంశు శుక్లా
భూమిపైకి సురక్షితంగా చేరుకున్న శుభాంశు శుక్లా
Shubhanshu Shukla : యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా… మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూమిని చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 2.50 నిమిషాలకు కాలిఫోర్నియా (California) సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ అయ్యారు. డ్రాగన్ స్పేస్ క్యాప్స్‌లో భూమి మీదకు చేరుకున్నారు. వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించేందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా, అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన ముద్దుబిడ్డ గా శుభాంశు శుక్లా నిలిచాడు.
Shubhanshu Shukla – ఐఎస్‌ఎస్ నుంచి ఘనంగా వీడ్కోలు
ఐఎస్‌ఎస్‌లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు (Shubhanshu Shukla) రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. శుభాంశు బృందం ఐఎస్‌ఎస్‌లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది.
నవభారత శకమిది – శుభాంశు భావోద్వేగం
భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు (Shubhanshu Shukla) ఐఎస్‌ఎస్‌లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్. నిర్భయ భారత్. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు.
అక్కడి సహచరులపై శుభాంశు (Shubhanshu Shukla) ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ 25న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు.
జూన్ 25న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభం
శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్ర జూన్ 25, 2025న ప్రారంభమైంది. అమెరికాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోకి వెళ్లింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించారు. అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించారు. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు.
దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్‌ఎస్‌లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.
శుభాంశు శుక్లాపై ప్రధాని మోదీ రియాక్షన్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా భూమికి చేరుకున్న భారత వ్యోమగామిపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. కోట్లాది మందికి ఆయన ప్రేరణ అన్నారు. కోట్లాది మందికి ఆయన అంకితభావం, ధైర్యం, స్ఫూర్తి ప్రేరణ అందిస్తుందన్నారు. గగన్‌యాన్‌కు ఈ యాత్ర మరో మైలురాయి అవుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రధాని మోదీ స్పందించారు.
శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) సురక్షితంగా భూమిని చేరుకోవడంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. ‘‘ఈ యాత్ర విజయంతో రోదసిరంగంలో భారత్ శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది యావత్ ప్రపంచానికి గర్వకారణం. ఈ క్షణం భారత్‌కు మాత్రం అత్యంత ప్రత్యేకమైనది’’ అని హర్షం వ్యక్తంచేశారు. రోదసిలో 18 రోజులు గడిపి, మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన శుక్లా బృందం… మంగళవారం మధ్యాహ్నం 3.01కి కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగింది. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం-4 కమాండర్ పెగ్గీ విట్సన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇది కీలకం కానుంది. ఈ క్రమంలో చేపడుతున్న పరీక్షలు విజయవంతం అవుతున్నాయి. ఈ గగన్‌యాన్ ప్రాజెక్టు ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. గగన్‌యాన్ యాత్రను 2027 తొలి త్రైమాసికంలో చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ ఇటీవల వెల్లడించారు.
Also Read : Bengaluru: బెంగళూరులో దారుణం విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం
