TTD: తిరుమల కల్తీ నెయ్యి దర్యాప్తుపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
తిరుమల కల్తీ నెయ్యి దర్యాప్తుపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
TTD : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటి వరకు దర్యాప్తు పురోగతిపై సుప్రీంకోర్టుకు స్థాయీ నివేదికను సమర్పించాయి. 2019-24 మధ్యకాలంలో లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయి నేతృత్వంలోని ధర్మాసనం గత ఏడాది అక్టోబరు 10న జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అధికారులతోపాటు, భారత ఆహార ప్రమాణాల నియంత్రణ సంస్థ ప్రతినిధితో కూడిన సిట్ ఈ కేసును విచారిస్తోంది.
TTD Laddu Controversy Case
ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు, జరిగిన అరెస్ట్‌లు, స్థానిక కోర్టు నుంచి హైకోర్టు వరకు వివిధ వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లు, వాటి విచారణ స్థితిగతుల గురించి సీబీఐ సీల్డ్ కవర్‌లో సుప్రీం కోర్టుకు సమర్పించినట్లు తెలిసింది. మరోవైపు తితిదే మాజీ ఛైర్మన్, వైకాపా రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి సిట్ దర్యాప్తు తీరును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలుచేశారు. సిట్ సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, దాన్ని నిలువరించాలని కోరారు. ఈ కేసు జులై 14న విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.
Also Read : CM Chandrababu: సూపర్ సిక్స్ లో మరో పథకానికి డేట్ ఫిక్స్
