రాజాసింగ్ ఆధ్వ‌ర్యంలో శ్రీ‌రామ న‌వమి శోభా యాత్ర

హైద‌రాబాద్ లోని ధూల్ పేట‌లో ఘ‌నంగా ప్రారంభం

హైద‌రాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వ‌ర్యంలో శ్రీరామ నవమి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా శుక్ర‌వారం శోభాయాత్ర ధూల్‌పేటలో ఘ‌నంగా ప్రారంభం అయ్యింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి, శివారు ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు ఈ యాత్రలో పాల్గొనడానికి ధూల్‌పేటకు తరలి వచ్చారు. కట్టుదిట్టమైన భద్రతా నడుమ ధూల్‌పేటలోని ఆకాశపురి నుండి ప్రారంభమైంది. కాషాయ వస్త్రాలు ధరించిన యువకులు యాత్ర పొడవునా ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. నిర్వాహకులు యాత్ర సాగే మార్గంలోని వీధులను, సందులను కాషాయ జెండాలు , తోరణాలతో అలంకరించడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ యాత్రలో శ్రీరాముడు, శ్రీ హనుమంతుడు, ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఇదిలా ఉండ‌గా ఎండ కాలం కావ‌డం, వేడి ఎక్కువ‌గా ఉండ‌డంతో శోభా యాత్ర మార్గం పొడవునా పలువురు స్థానికులు పాల్గొన్న వారికి నీరు, నిమ్మరసం, లస్సీని అందించారు. మరికొందరు స్థానికులు వారికి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రాజా సింగ్ యాత్రలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు, ఆయనపై పూల రేకుల వర్షం కురిపించారు. మరోవైపు యాత్ర ప్రశాంతంగా సాగేలా హైదరాబాద్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారులు నిఘా కెమెరాలు , డ్రోన్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు. యాత్ర సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ మళ్లింపులను కూడా అమలు చేశారు. పురానాపూల్, బేగం బజార్ ఛత్రి, సిద్దింబ‌జార్, గౌలిగూడ, సుల్తాన్ బజార్ వంటి ప్రధాన రహదారుల గుండా సాగే ఈ యాత్ర, సాయంత్రం వేళ కోఠిలోని శ్రీ హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగుస్తుంది.

Leave A Reply

Your Email Id will not be published!