Sri Sri Poet Comment : శ్రీ‌శ్రీ అనంతం ‘మ‌హా ప్ర‌స్థానం’

తెలుగు సాహిత్యానికి దిక్సూచి

Sri Sri Poet Comment : శ్రీ‌శ్రీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తెలుగు సాహిత్యాన్ని శాసించిన వాడు. భూ మార్గం ప‌ట్టించిన వాడు. సామాన్యుల ఆర్త నాదాల‌ను అక్ష‌రాల‌లోకి ఒలికించిన వాడు. అంతా తానైన వాడు. క‌వి, ర‌చయిత‌, అనువాద‌కుడు, వ‌క్త ఇలా ప్ర‌తి దాంట్లోను శ్రీ‌శ్రీ త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చాడు.

శ్రీ‌శ్రీ అంటే ఓ ఉపెన..ఓ కెర‌టం..ఓ స‌ముద్రం. బ‌తుకు ప్ర‌యాణంలో ఏనాడైనా నిస్స‌త్తువ‌కు లోన‌వుతే వెంట‌నే శ్రీ‌శ్రీ గుర్తుకు తెచ్చుకుంటే చాలు. నిస్తేజం మాయ‌మ‌వుతుంది..ఉద్రేకం..ఆవేశం..చైత‌న్యం ఒక్క‌సారిగా శ‌రీరంలోకి వ‌చ్చేస్తాయి. అత‌డి అక్ష‌రాల‌కు అంత శ‌క్తి ఉంది. అందుకే అవి అక్ష‌రాలు కావు అస్త్రాలు..ఆయుధాలు..గుండెల్ని చీల్చే బాణాలు. శ్రీ‌శ్రీ త‌ను న‌మ్మిందే రాశాడు. వాస్త‌వాల‌ను బ‌హిరంగంగా చెప్పిన ద‌మ్మున్న క‌వి ఆయ‌న‌.

తెలుగు సాహిత్యం గురించి చెప్పాలంటే శ్రీ‌శ్రీ కంటే ముందు శ్రీ‌శ్రీ కంటే త‌ర్వాత చెప్పుకోవాలి. అందుకే ఈ శ‌తాబ్ధం నాది అని స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించాడు. త‌న క‌లంలో ద‌మ్ముంది. త‌నలో విద్వ‌త్తు ఉంది కాబ‌ట్టే ఛాలెంజ్ చేయ‌గ‌లిగాడు. అందుకే మ‌హా ప్రస్థానంకు ముందు మాట రాసిన గుడిపాటి వెంక‌ట చ‌లం సందోర్భోచితంగా వ్యాఖ్యానించారు. శ్రీ‌శ్రీ‌ని, ఆయ‌న క‌విత్వాన్ని తూచే రాళ్లు నా వ‌ద్ద లేవ‌న్నాడు.

మ‌రి శ్రీ‌శ్రీ అంటే శ్రీ‌రంగం శ్రీ‌నివాస‌రావు. ఏప్రిల్ 30 ఆయ‌న జ‌యంతి. అందుకే స్మ‌రించు కోవాల్సి వ‌స్తోంది. తూటాల్లాంటి మాట‌ల‌తో ఆక‌లి రాజ్యంపై ర‌క్తాక్ష‌రాలు లిఖించాడు శ్రీ‌శ్రీ‌. ఈ ప్ర‌పంచానికి మార్క్సిజమే మందు అని న‌మ్మాడు. మ‌హా ప్ర‌స్థానంతో తెలుగు క‌విత్వానికి విశ్వ వేదిక‌పై గుర్తింపు తీసుకు వ‌చ్చేలా చేశాడు శ్రీ‌శ్రీ‌.

ఖాళీ క‌డుపు, ఖాళీ జేబు ఉన్న‌ప్పుడు శ్రీ‌శ్రీ గుర్తుకు వ‌స్తాడు. న‌డిచినా, ఆలోచించినా , మాట్లాడినా ఏదో ఒక సంద‌ర్భంలో శ్రీ‌శ్రీ ప‌లక‌రిస్తాడు. ప‌ల‌వ‌రించేలా చేస్తాడు. నిప్పులు చిమ్ముకుంటూ నేనెగిరి పోతే నిబిడాశ్చ‌ర్యంతో మీరే మీరే అని అన‌గ‌లిగిన ఏకైక మ‌హాక‌వి శ్రీ‌శ్రీ ఒక్క‌డే. క‌దం తొక్కుతూ ప‌దం పాడుతూ హృదాంత‌రాళాన్ని గ‌ర్జించాడు . కుక్క పిల్లా..అగ్గి పుల్లా ..క‌ట్టె పుల్లా..స‌బ్బు బిల్లా అంతా క‌విత‌మ‌యం అంటూ పిలుపునిచ్చాడు శ్రీ‌శ్రీ‌.

నేనొక దుర్గం..నాదొక స్వ‌ర్గం..అన‌ర్గ‌ళం..అనిత‌ర సాధ్యం నా మార్గం అంటూ త‌న దారేదో స్ప‌ష్టం చేశాడు మ‌హా క‌వి. ఆయ‌న క‌విత్వంలో బాధితులే పాత్రధారులు..ఆక‌లితో అల‌మ‌టించే వాళ్లు. అన్నార్థులు, అభాగ్యులు..సామాన్యులు, పేద‌లు త‌న‌కు ఆప్తులుగా ప్ర‌క‌టించాడు. వారి త‌ర‌పున త‌న గొంతుక‌ను ఇచ్చాడు.

స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అయ్యే వారికి క‌విత్వంతో క‌ర‌చాల‌నం చేశాడు శ్రీ‌శ్రీ‌. మ‌న‌మంతా బానిస‌లం..పీనుగులం..గానుగులం అంటూ ఆక్రోశించాడు. ఆయ‌న లోకాన్ని వీడినా నేటికీ శ్రీ‌శ్రీ రాసిన అక్షరాలు శిలా శాస‌నాలుగా నేటికీ ఉన్నాయి. వెంటాడుతున్నాయి.

ఆనాటి నుంచి నేటికీ శ్ర‌మ దోపిడీ కొన‌సాగుతూనే ఉంది. గుర‌జాడ నా అడుగు జాడ అని రాసిన శ్రీ‌శ్రీ ప్ర‌పంచం మెచ్చిన క‌విరేణ్యుడు. ఛ‌మ‌క్కులు విస‌ర‌డంలోనే కాదు సినీ గేయ ర‌చ‌యిత‌గా కూడా ప్ర‌సిద్ది చెందాడు.

అక్ష‌రాల‌తో అగ్ని కీల‌ల‌ను సృష్టించిన శ్రీ‌శ్రీ అద్బుత‌మైన ప్రేమికుడు కూడా. నా హృద‌యం లో నిదురించే చెలి అన్నాడు. తెలుగు వీర లేవ‌రా అంటూ రాసిన శ్రీ‌శ్రీ పాడ‌వోయి భార‌తీయుడా అంటూ చైత‌న్య గీతాల‌కు ప్రాణం పోశాడు. ఎన్నో పుర‌స్కారాలు, అవార్డులు అందుకున్న శ్రీ‌శ్రీకి శ్రీ‌శ్రీ‌నే సాటి..ఆయ‌న‌కు లేరెవ్వ‌రూ పోటీ.

Also Read : పోటెత్తిన భ‌క్త‌జ‌నం ద‌ర్శ‌నం క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!