Srikanth Chary Comment : ‘అమరత్వానికి’ గుర్తింపు ఏది..?
కాసోజు శ్రీకాంతాచారికి సలాం
Srikanth Chary Comment : మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన ఏకైక వ్యక్తి కాసోజు శ్రీకాంతాచారి. కాలజ్ఞానంతో వినుతికెక్కిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆచారికి చెందిన కుల వృత్తుల విశ్వ బ్రాహ్మణుల కులం పుట్టిన వాడు. ఎవరైనా పుడితే కలకలాం బతకాలని కోరుకుంటారు.
కానీ శ్రీకాంతాచారి ఉమ్మడి రాష్ట్రంలో అణగారి పోయిన తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలగాలని భావించాడు. తన ప్రాణాన్ని తృణ ప్రాయంగా త్యజించాడు. జై తెలంగాణ అంటూ ప్రాణాలు కోల్పోయాడు. ఇవాళ శ్రీకాంతాచారి వర్ధంతి. అతడి మరణం ఎన్నో పాఠాలు నేర్పింది.
తెలంగాణ అంటేనే ఉద్యమాలకు, పోరాటాలకు, త్యాగాలకు, బలిదానాలకు పెట్టింది పేరు. మరి ఈ గడ్డ ఆత్మ గౌరవం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర ఉంది. ఎందరో వీరులను, మహానుభావులను, ఉద్యమకారులను కన్నది ఈ నేల. అత్యంత చైతన్యవంతశీలత కలిగిన ప్రాంతం ఇది.
అందుకే ఇక్కడ ధిక్కార స్వరాలు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటాయి. తూటాలు పేల్చినా, కర్కశత్వంతో లాఠీలు ఝులిపించినా , ఎన్ కౌంటర్ల పేరుతో కాల్చి చంపినా ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటాయి. ప్రశ్నించడం నా హక్కు. నిలదీయడం నా పోరాటం అని చెప్పిన ధీరులు ఎందరో. ఒకరా ఇద్దరా కాసోజు శ్రీకాంతాచారి(Srikanth Chary) చేసిన బలిదానం తెలంగాణ పోరాటానికి ఆయువు పట్టుగా మారింది.
ఆ తర్వాత అతడిని ఆదర్శంగా తీసుకుని ఏకంగా 1200 మందికి పైగా అసువులు బాసారు. కానీ కోరి..కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరులకు సరైన గుర్తింపు లభిస్తుందని ఆశించారు. దళితుడే సీఎంగా ఉంటాడని ప్రకటించి ఆ తర్వాత తానే కొలువు తీరిన కేసీఆర్ మాట మార్చారు. మాయ మాటలతో, సొల్లు కబుర్లతో ఆనాటి దొరల పాలనను గుర్తుకు తెచ్చేలా చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.
కేవలం 500 మంది అమరులకే అరకొర సాయం అందిందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం వచ్చినా సావులు తప్పలేదు. సమస్యలు తీరలేదు. ప్రజా ప్రతినిధులు రాబంధులై తెలంగాణ తల్లిని దిక్కులేనిదిగా మార్చేశారు. అమరుడిని కన్న శంకరమ్మ, వెంకటాచారి లకు ఆదెరవు లేకుండా పోయింది.
తన కూతురు ఓడి పోతే వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చిన దొర శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేసే విషయంలో చేతుల రాలేదు. సరిగ్గా ఇదే రోజు డిసెంబర్ 3 , 2009న ఇక సెలవంటూ తనను తాను ఆత్మార్పణం చేసుకున్న కాసోజు శ్రీకాంతాచారి వెళ్లి పోయాడు.
ఆ అమరత్వం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. కానీ ఇకనైనా పాలకులు మారాలి. తెలంగాణ రాష్ట్రం కోసం బలైపోయిన ప్రతి ఒక్కరిని స్మరించు కోవాలి. ఆయా కుటుంబాలను ఆదుకోవాలి. అప్పుడే వారికి నిజమైన నివాళి.
Also Read : అమరులను విస్మరించిన కేసీఆర్ – షర్మిల