Justice Varma: జస్టిస్‌ వర్మను తొలగించడమే మేలు – సుప్రీంకోర్టు విచారణ కమిటీ

జస్టిస్‌ వర్మను తొలగించడమే మేలు - సుప్రీంకోర్టు విచారణ కమిటీ

Justice Varma : ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో నోట్ల కట్టలు వెలుగుచూసిన ఉదంతంలో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను (Justice Varma) తొలగించడమే మంచిదని సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీ అభిప్రాయపడింది. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన ఉన్నప్పుడు అధికార నివాసంలో అగ్నిప్రమాదం జరిగి భారీగా నగదు కాలిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ 10 రోజులపాటు విచారణ జరిపి, 55 మంది సాక్షులను ప్రశ్నించింది. స్టోర్‌ రూంతో తనకు సంబంధం లేదని జస్టిస్‌ వర్మ చెబుతున్నా అది పూర్తిగా ఆయన, లేదా కుటుంబ సభ్యుల నియంత్రణలోనే ఉందని తేల్చింది. తనపై కుట్ర జరుగుతోందని న్యాయమూర్తి చేసిన వాదనను తోసిపుచ్చింది. అసలు ఆయన పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. తమ నివేదిక ఆధారంగా న్యాయమూర్తికి ఉద్వాసన చెప్పాలని భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఉన్నప్పుడు రాష్ట్రపతికి, ప్రధానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

Justice Varma – ప్రజా విశ్వాసం సడలిపోతుంది

‘‘సగం కాలిన నగదును మార్చి 15వతేదీ తెల్లవారుజామున న్యాయమూర్తి కుటుంబసభ్యులే తరలించారనడానికి ఆధారాలున్నాయి. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు అత్యంత నిజాయతీతో ఉండాలని ప్రజలు ఆశిస్తారు. కోర్టులోపలే కాకుండా బయట కూడా వారి ప్రవర్తనను గమనిస్తారు. పనితీరు, వారి ప్రవర్తనపైనే ప్రజా విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం లోపాలున్నా ప్రజా విశ్వాసం సడలిపోతుంది’’ అని కమిటీ నివేదిక పేర్కొంది. స్టోర్‌ రూంలోని అంతభారీ నోట్లకట్టలకు జస్టిస్‌ వర్మ ఎలా లెక్కలు చెబుతారు, కాలిన నోట్లను తొలగించింది ఎవరు అని ప్రశ్నించింది. స్టోర్‌రూంపై సీసీటీవీ కెమెరాల నిఘా నిరంతరం ఉంటుందని, భద్రతాసిబ్బంది నియంత్రణలో అవి ఉంటాయని జస్టిస్‌ వర్మ చేసిన వాదనను కమిటీ తోసిపుచ్చింది.

Also Read : CM Chandrababu : రెండు గిన్నీస్ బుక్ సహా 22 ప్రపంచ రికార్డుల సాధన లక్ష్యంగా యోగాంధ్ర

Leave A Reply

Your Email Id will not be published!