భార‌త ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ

ఒక పిటిష‌న‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన స‌ర్ ప్ర‌క్రియ‌పై ఎట్ట‌కేల‌కు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు స్పందించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ పై రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన కోరింది. ఇదే క్ర‌మంలో దాఖ‌లైన పిటిష‌న్ కు సంబంధించి ఒక పిటిషనర్ ప్రవర్తనపై అభ్యంతరం వ్య‌క్తం చేసింది. సుప్రీంకోర్టు ఈ అంశంపై స్పందిస్తూ పిటిషనర్లలో ఒకరి ప్రవర్తనపై వివరణ కోరనున్నట్లు పేర్కొంది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ,ఇండియా’ కూటమికి చెందిన ఇతర నాయకులు ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో తదుపరి విచారణలో పిటిషనర్లలో ఒకరి ప్రవర్తనను పరిశీలిస్తామని కోర్టు సంకేతాలు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ , జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో స‌ర్ ప్రక్రియ చెల్లుబాటును సవాలు చేస్తూ పెండింగ్‌లో ఉన్న ఇతర కేసులతో జత చేయాలని ఆదేశించింది.

తాము నోటీసులు జారీ చేస్తున్నామని, దీనిని ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కేసులతో జత చేస్తున్నామని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. ఎన్నికల సంఘం తరపున ఎవరైనా నోటీసును స్వీకరించాలని లేదా పిటిషనర్లు ప్రతివాదులకు నోటీసులు అందజేయాలని సూచించింది. పిటిషనర్లలో ఒకరి ప్రవర్తనపై వివరణ కోరనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని ప్రస్తుతానికి వెల్లడించలేదు. తదుపరి విచారణ తేదీన పిటిషనర్లలో ఒకరిని వారి ప్రవర్తన గురించి అడగాలని అనుకుంటున్నట్లు తెలిపింది. సదరు పిటిషనర్‌కు సంబంధించిన పిటిషన్‌ను తాత్కాలికంగా మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, తన ప్రవర్తనపై వివరణ ఇచ్చే అంశంపైనే ఇది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ, ‘ఇండియా’ కూటమికి చెందిన మరో 12 మంది నాయకులు అక్టోబర్ 12న ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. స‌ర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లను తొలగించడం, అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

Leave A Reply

Your Email Id will not be published!