Supreme Court: వీధి కుక్కల తీర్పుపై సుప్రీం కోర్టు యూటర్న్ ?
వీధి కుక్కల తీర్పుపై సుప్రీం కోర్టు యూటర్న్ ?
Supreme Court : దేశ రాజధాని ఢిల్లీ నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలంటూ వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చాలామంది ఈ తీర్పును సమర్థించగా… కొన్ని వర్గాల నుంచి మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో… ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ముందు కొందరు న్యాయవాదులు లేవనెత్తారు. అయితే అభ్యంతరాల నేపథ్యంలో ఆ తీర్పును పునపరిశీలిస్తానని ఆయన స్పష్టం చేశారు. దీనితో తీర్పు వెనక్కి తీసే అవకాశాలు ఉండొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.
రాజధాని రీజియన్‌లో పసికందులు, వృద్దులుపై వీధి కుక్కల దాడుల ఘటనలపై పలు మీడియా సంస్థలు ఇచ్చాయి. అందులో ఘటనలతో పాటు రేబిస్ బారిన పడి మరణించిన దాఖలాలను ప్రస్తావించాయి. ఈ కథనాలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది. వీధి కుక్కలను నివాస ప్రాంతాల్లో సంచరించడం ఏమాత్రం యోగ్యం కాదని, వాటిని పట్టుకుని షెల్టర్లకు తరలించాలని, ఇందుకు 8 వారాల గడువు విధిస్తూ ఢిల్లీ సర్కార్‌కు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆగస్టు 11వ తేదీ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో… ఏదైనా సంస్థలు ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఇది ప్రజల మేలు కోసం చేస్తున్నది స్పష్టం చేసింది. అయితే వీధి కుక్కల కోసం షెల్టర్లు నిర్మించడం, తరలించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చని ఢిల్లీ అధికార యంత్రాంగం అంటోంది. అదే సమయంలో రాజకీయ, సినీ, ఇతర ప్రముఖుల నుంచి సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
Supreme Court – వీధి శునకాల వివాదంపై త్రిసభ్య ధర్మాసనం
దేశ రాజధాని దిల్లీ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలన్న ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) త్రిసభ్య ధర్మాసనం ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరపనుంది. వీధి కుక్కల దాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం దిల్లీలో అవి ఎక్కడా కనిపించడానికి వీల్లేదంటూ ఈ నెల 11న తీర్పు వెలువరించింది. ఎనిమిది వారాల్లోగా శునకాలను షెల్టర్లకు తరలించాలని పేర్కొంది.
దీనిపై జంతు హక్కుల సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు నిరసన తెలిపిన విషయాన్ని కాన్ఫరెన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ తరఫు న్యాయవాది బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో జస్టిస్ జె.కె.మహేశ్వరి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వీధి కుక్కల సమస్యపై దాఖలైన వ్యాజ్యాలను ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టులకు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఆ అంశాన్ని తాను పరిశీలిస్తానని జస్టిస్ గవాయ్ హామీ ఇచ్చారు. కొద్ది సేపటి తర్వాత..శునకాల వివాదాన్ని సుమోటోగా చేపడుతున్నట్లు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. కాగా, సుప్రీం ధర్మాసనం ఆదేశాలతో దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ గత రెండు రోజుల్లో వంద కుక్కలను పట్టుకుని జంతు నియంత్రణ కేంద్రానికి తరలించింది.
Also Read : CM Chandrababu: పులివెందుల ఉప ఎన్నికలపై చంద్రబాబు ఆశక్తికర వ్యాఖ్యలు
