Ram Setu: ‘రామ సేతు’ విషయంలో కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
‘రామ సేతు’ విషయంలో కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
Ram Setu : ‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ గతంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రామసేతుకు (Ram Setu) సకాలంలో జాతీయ స్మారక చిహ్నం హోదా కల్పించాలని, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలని గతంలో సుబ్రమణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా విచారణ చేపట్టారు. సుబ్రమణ్య స్వామి తరఫున సీనియర్ న్యాయవాది విభా మఖిజా వాదనలు వినిపించారు.
Supreme Court – Ram Setu
రామసేతును కాలుష్యం నుంచి కాపాడటంతో పాటు దాని పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని సుబ్రమణ్యస్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ప్రదేశం పలువురి నమ్మకాలతో ముడిపడి ఉందని తెలిపారు. మరోవైపు ‘సేతు సముద్రం షిప్ ఛానెల్ ప్రాజెక్టు’ కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని, తద్వారా రామసేతుకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని పేర్కొంటూ సుబ్రమణ్య స్వామి మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం అది సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మన్నార్, పాక్ జలసంధిని కలుపుతూ 83 కి.మీ మేర పూడిక తీసి..ఛానెల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది కార్యరూపం దాల్చితే రామసేతుపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి.
రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో గతంలోనే ఓ పిల్ దాఖలు చేశారు. పురాతన కట్టడాలు, ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 ప్రకారం రామసేతను నేషనల్ మాన్యుమెంట్‌గా ప్రకటించాలని తాను దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వ సమాధానం కోరుతూ 2023లో కోర్టు ఆదేశాలిచ్చిందని స్వామి కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత తాను 2023, 2025లో ప్రభుత్వానికి రెండు రిప్రజెంటేషన్లు పంపినప్పటికీ ఈ అంశం విచారణకు రాలేదని చెప్పారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఈ పిటిషన్‌లో చేర్చాలని కోరారు. తద్వారా రామసేతుకు సకాలంలో జాతీయ స్మారక చిహ్నం హోదా కల్పించాలని కోర్టుకు విన్నవించారు. స్మారక చిహ్నమా? కాదా అనే విషయాన్ని తేల్చకుండా కేంద్రం ఏళ్లతరబడి నాన్చుతోందని తన పిటిషన్‌లో ఆక్షేపించారు. దీనిని పరిశీలించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ జేబీ పార్దీవాలాల ధర్మాసనం.. దీనిపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Also Read : CM Siddaramaiah: ‘ఓటు చోరీ’పై నోరుజారిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
