Tahawwur Rana: ముంబయి ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్ వాయిస్, చేతిరాత శాంపిల్స్ సేకరణకు కోర్టు అనుమతి
ముంబయి ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్ వాయిస్, చేతిరాత శాంపిల్స్ సేకరణకు కోర్టు అనుమతి
Tahawwur Rana : ముంబయి ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అమెరికా పోలీసుల అదుపులో ఉన్న రాణాను… ప్రధాని మోదీ(PM Modi) జరిపిన దౌత్య సంబంధాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతడ్ని భారత్ కు అప్పగించారు. తొలుత అరెస్టయిన సమయంలో తహవ్వుర్ కు విధించిన 18 రోజుల కస్టడీ గడువు సోమవారంతో ముగియగా.. అతడిని ఎన్‌ఐఏ కోర్టులో హాజరు పరచగా 12 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనితో మరికొన్ని రోజుల పాటు అతడు ఎన్‌ఐఏ కస్టడీలోనే ఉండనున్నాడు.
Tahawwur Rana Investigation Updates
మరోవైపు ముంబయి ఉగ్రదాడి కేసు విచారణను ముమ్మరం చేసిన ఎన్ఐఏ… తమ కస్టడీలో ఉన్న తహవ్వుర్ హుస్సేన్ రాణా(Tahawwur Rana) వాయిస్, చేతిరాత శాంపిల్స్ ని సేకరించేందుకు ఢిల్లీ ప్రత్యేక కోర్టును అనుమతి కోరింది. దీనితో ఢిల్లీ ప్రత్యేక కోర్టు… రాణా వాయిస్, హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ సేకరణకు ఎన్‌ఐఏకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. కోర్టు సూచనలకు అనుగుణంగా త్వరలో రాణా… వాయిస్, చేతి రాతకు సంబంధించిన శాంపిల్స్ ను సేకరించడానికి ఎన్ఐఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఎన్‌ఐఏ అదుపులో ఉన్న రాణాను ఇటీవల ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. ఈ విచారణకు అతడు సహకరించకుండా… తప్పించుకునే రీతిలో సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ముంబయి ఉగ్రదాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో భాగంగా రాణా వెల్లడించినట్లు సమాచారం. తహవ్వుర్ రాణా పాకిస్థాన్ కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అరెస్టయ్యాడు. అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన అతడిని అప్పగింత ప్రక్రియలో భాగంగా భారత్‌కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
2008 నవంబర్ 26న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబయికి చేరుకుని.. ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు మారణహోమం కొనసాగింది. ఈ ఘటనల్లో 18 మంది భద్రత సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడిన ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది.
Also Read : YS Jagan Mohan Reddy: సింహాచలం ఘటన మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ