Tahawwur Rana: తహవ్వుర్ రాణా వాయిస్ శాంపిల్స్ సేకరణకు ఎన్ఐఏ ప్రణాళికలు
తహవ్వుర్ రాణా వాయిస్ శాంపిల్స్ సేకరణకు ఎన్ఐఏ ప్రణాళికలు
Tahawwur Rana : అమెరికా నుంచి తీసుకొచ్చిన 26/11 ముంబయి ఉగ్రదాడి కుట్రదారు తహవ్వుర్ రాణా… ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తహవ్వుర్ రాణాను 18 రోజుల కస్టడీకు తీసుకున్న ఎన్ఐఏ అధికారులు… ముంబై ఉగ్రదాడుల కేసు దర్యాప్తును ముమ్మరం చేసారు. ఈ నేపథ్యంలో ముంబై ఉగ్ర దాడుల కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి రాణా(Tahawwur Rana) వాయిస్ నమూనాను సేకరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నమూనాల ద్వారా ముంబయి ఉగ్రదాడుల సమయంలో ఇతరులతో అతడు మాట్లాడినట్లు అనుమానిస్తున్న పలు కాల్ రికార్డ్‌లను ధ్రువీకరించే అవకాశం ఉంది.
Tahawwur Rana Investigation
అయితే… వాయిస్ నమూనా కోసం నిందితుడి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అతడు అందుకు నిరాకరిస్తే అధికారులు న్యాయస్థానం నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. కోర్టు అంగీకారం తెలిపిన అనంతరం అతడి వాయిస్‌ను రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కాగా విచారణలో భాగంగా ముంబయి దాడులకు ప్రధాన కుట్రదారులైన జకీర్ రెహ్మాన్ లఖ్వీ, సాజిద్ మజీద్ మీర్, పాకిస్థాన్ కు చెందిన ఇలియాస్ కశ్మీరీ, అబ్దుల్ రెహమాన్ తదితరుల గురించి రాణాను ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి రోజు విచారణలో రాణా తమకు సహకరించలేదని… చాలా ఏళ్లు అయినందువల్ల అప్పుడు ఎవరెవరిని కలిశానో గుర్తు తెచ్చుకోలేకపోతున్నానని చెప్పాడని అన్నారు. దాడులకు వారం రోజుల ముందే తాను ముంబయికి వచ్చినట్లు పేర్కొన్నాడన్నారు.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నుంచి గురువారం రాణా(Tahawwur Rana)ను భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం నేరుగా ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర్చి విచారించారు. న్యాయస్థానం అతడిని 18 రోజుల కస్టడీకి అప్పగించింది. శుక్రవారం తెల్లవారుజామున రాణాను ఎన్‌ఐఏ హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకొచ్చారు. అతడిని ప్రత్యేక గదిలో ఉంచి నిరంతర నిఘా పెట్టారు. ఈ కేసులో మరో నిందితుడైన డేవిడ్ హెడ్లీకి సహకరించిన ఓ రహస్య వ్యక్తిని కూడా అధికారులు విచారిస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఆ వ్యక్తి తహవ్వుర్ రాణా, హెడ్లీకి చిన్ననాటి స్నేహితుడని తెలుస్తోంది.
Also Read : Pastor Praveen Kumar: పాస్టర్ ప్రవీణ్ ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ ! స్పష్టం చేసిన ఏలూరు డీఐజీ !