TDP MLC Candidates: మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

 

టీడీపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్ర కసరత్తు తర్వాత మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా కావలి గ్రీష్మ(ఎస్సీ), బీద రవిచంద్ర (బీసీ), బీటీ నాయుడు(బీసీ)లను ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగు వేసినట్లు స్పష్టమవుతోంది. సోమవారంతో నామినేషన్‌ గడువు ముగియనుండటంతో ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నిక జరగనుండగా… ఒక స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరఫున కొణిదెల నాగబాబు నామినేషన్‌ కూడా వేశారు. మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు కసరత్తు చేస్తున్న క్రమంలో… బీజేపీకు ఒక స్థానం కేటాయించారు. తెలుగుదేశం నుంచి ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీ ఒక స్థానం కేటాయిస్తూ తెదేపా నిర్ణయం తీసుకుంది. ఈ సారి బీజేపీకు ఒక సీటు ఇచ్చినందున సర్దుబాటు చేయలేకపోతున్నామని, 2027లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడుతున్నందున అప్పుడు అవకాశం కల్పిస్తామని ఆశావహులకు పార్టీ పెద్దలు సర్ది చెబుతున్నాట్లు సమాచారం. ఈ మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి జవహర్‌, దువ్వారపు రామారావు, టీడీ జనార్ధన్‌ కు అధిష్ఠానం నుంచి ఫోన్లు వెళ్లినట్టు సమాచారం.

 

 

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతీ కుమార్తె కావలి గ్రీష్మ. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్రతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన బీటీ నాయుడులకు ఎంపిక చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల నుంచి ముగ్గురిని ఎంపిక చేసినట్లు అయింది. మరోవైపు మార్చి 20వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక కూటమిలోని మిత్ర పక్షాలైన బీజేపీ, జనసేనకు కలిపి రెండు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించారు. జనసేన నుంచి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించారు. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో నామినేషన్ సైతం దాఖలు చేశారు. ఇక బీజేపీకి చివరి నిమిషంలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠత నెలకొంది.

Leave A Reply

Your Email Id will not be published!