Teacher: ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాసిన ఉత్తరాఖండ్ లో టీచర్
ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాసిన ఉత్తరాఖండ్ లో టీచర్
Teacher : బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని ఆ రాష్ట్ర ఉపాధ్యాయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (PM Modi) కోరుతున్నారు. పదోన్నతులు, బదిలీలు, పాత పెన్షను పథకంతో సహా సుమారు 34 డిమాండ్లతో గత నెల రోజులుగా తాము నిరసన తెలుపుతున్నా రాష్ట్ర సర్కారు స్పందించడం లేదంటూ ఓ టీచరు (Teacher) ప్రధానికి రక్తంతో లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. చంపావత్ జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రాంతీయ సభ్యుడు రవి బాగోటి ఈ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 500 మంది ఉపాధ్యాయులు ప్రధానికి లేఖలు రాసినట్లు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ప్రాంతీయ అధ్యక్షుడు రామ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యేతర విధులన్నీ బహిష్కరించి, బోధన మాత్రమే చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా తమ డిమాండ్లపై ప్రధాని (PM Modi) జోక్యం కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Teacher – బరేలీలో ‘ఐ లవ్ మహ్మద్’ ర్యాలీ వివాదం
‘ఐ లవ్ మహ్మద్’కార్యక్రమానికి మద్దతుగా చేపట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ఇత్తెహాద్–ఇ–మిల్లత్ కౌన్సిల్ చీఫ్, మత పెద్ద తౌకీర్ రజా ఖాన్ చేసిన ప్రకటన యూపీలో బరేలీలో (Barely) శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఒక మసీదు వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇందుకు కారకులుగా గుర్తించిన డజను మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఏదేమైనా ర్యాలీని నిర్వహిస్తామంటూ గురువారం ప్రకటించిన రజా ఖాన్.. అధికారులు అనుమతి ఇవ్వనందున ర్యాలీని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రకటించారు. దీంతో, ‘ఐ లవ్ మహ్మద్ అని రాసిన పోస్టర్లను చేబూనిన జనం పెద్ద సంఖ్యలో కొత్వాలీ ఏరియాలోని రజా ఖాన్ నివాసం, మసీదు వద్ద గుమికూడారు.
ప్రదర్శనను వాయిదా వేయడంపై ఆగ్రహంతో ఇస్లామియా ఇంటర్ కాలేజీ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నాం. దీంతో రాళ్లు రువ్వుతూ, వాహనాలు, దుకాణాలపై దాడులకు పాల్పడ్డారు. వారిని చెదరగొట్టాం’అని పోలీసు అధికారులు తెలిపారు. పలువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇత్తెహాద్–ఇ–మిల్లత్ కౌన్సిల్‌ను అహ్మద్ రజా ఖాన్ ఏర్పాటు చేశారు. దక్షిణాసియాలో ఎక్కువ ప్రభావం కలిగిన సున్నీ ఇస్లాంలోని బెరేల్వీ వర్గాన్ని స్థాపించింది ఈయనే. ఈయన వారసుడే తౌకీర్ రజా ఖాన్. కాగా, ‘ఐ లవ్ మహ్మద్’నినాదంలో ఎలాంటి తప్పూ లేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
లద్దాఖ్ ఉద్యమనేత సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టు
లద్దాఖ్ ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌ను శుక్రవారం జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అరెస్టు చేసి వేరే ప్రాంతానికి తరలించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని, ఆ ప్రాంతాన్ని ఆరో షెడ్యూలు పరిధిలో చేర్చాలని కోరడంతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం సాగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారిన రెండు రోజుల అనంతరం పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలు ఈశాన్యంలో పర్వత ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తిని, అక్కడి షెడ్యూల్డు తెగలకు స్వయంపాలన సౌకర్యాన్ని కల్పిస్తోంది.
ఈ డిమాండ్ల కోసం లద్దాఖ్‌లో యువత చేపట్టిన ఉద్యమం ఉద్రిక్తంగా మారడంతో నలుగురు మృతిచెందగా.. 90 మంది గాయపడిన విషయం తెలిసిందే. లద్దాఖ్ పోలీసు విభాగం అధినేత ఎస్‌డీ సింగ్ జామ్వల్ స్వయంగా సోనమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాంగ్‌చుక్ అరెస్టు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా లేహ్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఇటీవలి లద్దాఖ్ హింసకు ఆయనే కారణమని కేంద్రం ఆరోపిస్తుండగా వాంగ్‌చుక్ దీన్ని ఖండించారు. వాంగ్‌చుక్ అరెస్టును కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా ప్రతిపక్షాలన్నీ ఖండించాయి. లద్దాఖ్‌లో నిరసనోద్యమంలో నలుగురు యువకుల మృతిపై న్యాయవిచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Also Read : Telangana Government: తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో
