Telangana Assembly: ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Telangana Assembly : తెలంగాణ శాసనసభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు దేవాదాయ చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చింది. బీసీ రిజర్వేషన్ల కు సంబంధించి రెండు బిల్లులకు తెలంగాణ శాసనసభ(Telangana Assembly) ఆమోదం లభించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించింది. దీని ద్వారా విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును సైతం శాసనసభ ఆమోదించింది. బిల్లులు ఆమోదం పొందిన అనంతరం అసెంబ్లీ(Telangana Assembly) మంగళవారానికి వాయిదా పడింది.
ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ, బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. దేవాదాయ చట్టసవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ శాసనసభ ముందుకు తీసుకొచ్చారు. వీటితో పాటు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వీటిపై పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం ఈ బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
Telangana Assembly – చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు – సీఎం రేవంత్ ప్రతిపాదన
తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. దాన్ని పరిష్కరించేందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.
‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసమే కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టుకున్నాం. అదే ఒరవడిలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెడుతున్నాం. తెలంగాణ సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారు. గోల్కొండ పత్రికను సురవరం నడిపారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు లేఖ రాస్తా. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తుచేసుకుందాం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావాలని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను కోరుతున్నా.
నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేరు – సీఎం రేవంత్
దివంగత మాజీ సీఎం రోశయ్య, ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉంది. కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం సరికాదు. అందుకే బల్కంపేట్‌లో నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేరు పెడతాం. ఆయన సుదీర్ఘ అనుభవం గల నేత. గవర్నర్ గా, సీఎంగా ఎన్నో సేవలందించారు. నేచర్‌క్యూర్ ఆస్పత్రి సమీపంలో రోశయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తాం’’ అని సీఎం రేవంత్ ప్రకటించారు.
Also Read : PM Narendra Modi: ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్ లో పాక్ పై నిప్పులు చెరిన ప్రధాని మోదీ