Telangana BJP Comment : తెలంగాణలో కమలం వికసించేనా
ఇంకా కొలిక్కి రాని అభ్యర్థుల జాబితా
Telangana BJP Comment : దేశ వ్యాప్తంగా ఆక్టోపస్ లా విస్తరించిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆ పార్టీకి చెందిన రథ సారథి , ప్రధాన మంత్రి దామోదర దాస్ మోదీ, ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, కమలంలో మోస్ట్ పవర్ ఫుల్ టార్చ్ బేరర్ గా గుర్తింపు కలిగిన బీఎల్ సంతోష్ ఈసారి తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ప్రధానమంత్రి పదే పదే తెలంగాణలో పర్యటించారు. పలు బహిరంగ సభలలో పాల్గొన్నారు. ప్రధానంగా పవర్ లో కొలువు తీరిన బీఆర్ఎస్ బాస్ , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి పరుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ సీఎం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాదు కేసీఆర్ ముద్దుల కూతురు, లిక్కర్ స్కాంలో పీకల లోతు దాకా కూరుకు పోయి కేంద్ర దర్యాప్తు సంస్థల మెట్లు ఎక్కిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ప్రస్తావించారు.
Telangana BJP Comment Viral
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు , కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు అమిత్ చంద్ర షా. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అడ్డంగా బుక్ చేసింది తెలంగాణ సర్కార్. దీనిని నుంచి తప్పించు కునేందుకు కేంద్ర బీజేపీ కవితను టార్గెట్ చేసింది. మద్యం స్కాంలో ఇరికించింది. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి బీజేపీలో. రాష్ట్రంలో బీజేపీ చీఫ్ గా పని చేసిన బండి సంజయ్ హయాంలో ఆ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఒక రకంగా ఆ పార్టీకి ప్రాణం పోశారు. కానీ ఉన్నట్టుండి బండిని పక్కన పెట్టింది హైకమాండ్. ఎలాంటి పోరాట పటిమ లేని , సౌమ్యుడిగా పేరు పొందిన కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. ఇదే సమయంలో ఎందరో సీనియర్లు ఉన్నా ఇంకా బీజేపీ(BJP) రాష్ట్రంలో ఆశించిన మేర యుద్దం చేయలేక పోతోంది. ఇక బీఆర్ఎస్ , బీజేపీ(BJP), ఎంఐఎం ఒక్కటేనంటూ కాంగ్రెస్, బీఎస్పీ, వామపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి.
ప్రధాన మంత్రి, కేంద్ర హొం మంత్రి ఇద్దరూ పదే పదే కేసీఆర్ అవినీతి పరుడని, ఆయన కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ లక్షలాది మంది సాక్షిగా ప్రకటించినా ఆచరణలో ఏ ఒక్కరినీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేక పోయింది. ఇదే విషయాన్ని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. ఎవరి చెవుల్లో పూలు పెట్టాలని చూస్తున్నారంటూ మండి పడుతున్నారు. ఓ వైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నా ఒక్క పోస్ట్ నింప లేదు. పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా బీజేపీ ఆశించిన మేర పోరాట పటిమను చూపించ లేక పోతోంది. చూసీ చూడనట్లు , పైపై మాటలు, ఆరోపణలతో కాలం వెళ్లబుచ్చుతోంది. ఇక కేంద్రంలో మోదీ సర్కార్ కు అడుగడుగునా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. చివరకు మూడో ఫ్రంట్ పెడతానంటూ బయలు దేరిన గులాబీ బాస్ మిన్నకుండి పోయారు. ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు.
ఈ తరుణంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ స్పేస్ ను ఆక్రమించాల్సిన బీజేపీ(BJP) నిద్ర పోతోంది. ఇక బీజేపీ బాస్ ప్రధాన సమస్యలు, అంశాల గురించి ప్రస్తావించిన దాఖలాలు చాలా తక్కువ. బీఆర్ఎస్ నేతలకు ధీటుగా, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి దూసుకు పోతుంటే కిషన్ రెడ్డి ఆశించిన మేర దూకుడు ప్రదర్శించక పోవడంతో ఆ పార్టీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పటికే బీఆర్ఎస్ బాస్ 119 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక కాంగ్రెస్ తొలి విడతగా 55 సీట్లను కేటాయించింది. కానీ బీజేపీ ఇప్పటి వరకు జాబితా ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల షెడ్యూల్ ఈసీ ప్రకటించినా ఇంకా తాత్సారం చేస్తోంది. ఇప్పటి వరకు భారీగా 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అధికారంలోకి రావాలని పరితపిస్తున్న కాషాయ పార్టీ ఇప్పటి వరకు మనీ వేషాలు లెక్కించడం దేనికి సంకేతమో ఆ పార్టీ బాస్ చెప్పాలి.
Also Read : Tirumala Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భక్తజనం