Telangana Comment : జనం సెన్సేషన్ పార్టీలు పరేషాన్
కులం కీలకం గెలుపుపై ప్రభావం
Telangana Comment : భారత దేశ రాజకీయ ముఖ చిత్రం మారబోతోందా. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలోని 5 రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నా యావత్ దేశమంతా ఒకే ఒక్క రాష్ట్రంపై ఫోకస్ పెట్టడం ఒకింత విస్తు పోయేలా చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీ సైతం తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది. ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకుని ఆక్టోపస్ లో విస్తరించిన భారతీయ జనతా పార్టీని ఢీకొనేందుకు రెఢీ అయ్యింది. ఈ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరిని ప్రజలు గెలిపిస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఎన్నికలు జరిగేందుకు ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి ఆయా రాష్ట్రాలకు సంబంధించి తుది ఫలితాలు పూర్తవుతాయి. ఎవరు విజేతలుగా నిలుస్తారనేది డిసెంబర్ 3 నాడే పూర్తవుతుంది. కొన్ని రోజులుగా జరుగుతూ వస్తున్న ప్రచార పర్వానికి పుల్ స్టాప్ పడనుంది.
Telangana Comment Viral
గత శాసనసభ ఎన్నికల్లో ఆయా పార్టీల బలా బలాలు ఏమిటో తెలిసి పోయేవి. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ముందుగానే ప్రకటించింది ఎంఐఎం. ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మోటార్ సైకిల్ మీద సెక్యూరిటీ లేకుండా ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ ఆసీనులైన దొర సీఎం కేసీఆర్ ను కలిశారు. ఆయన చెప్పినట్లుగానే గులాబీ దళపతి విజయ ధరహాసం చిందించారు. కానీ రాను రాను సీన్ మారింది . పార్టీకి లెక్కించ లేనంత ఫండ్ సమకూరింది. దేశంలో బీజేపీ ఆదాయంలో నెంబర్ వన్ లో ఉంటే ప్రాంతీయ పార్టీలలో బీఆర్ఎస్ టాప్ లో నిలిచింది. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ అంటోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లను చీల్చే పనిలో పడిందని బీజేపీ విమర్శలు ఎదుర్కొంటోంది.
ఇది పక్కన పెడితే ఈసారి వార్ త్రిముఖ పోరు ఉంటుందని భావిస్తున్నారు. బరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ , ఎంఐఎం, బీఎస్పీ , సీపీఎం, సీపీఐ ఉన్నా సిసలైన యుద్దం మాత్రం హస్తం, కమలం, గులాబీ మధ్యనే జరుగుతుండడం విశేషం. అయితే బీఎస్పీ, ఎంఐఎం పార్టీలు మాత్రం కచ్చితంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి. ఇది పక్కన పెడితే తెలంగాణ(Telangana) రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి కులాల ప్రభావం, ఆధిపత్యం ఎక్కువగా ఉందనేది వాస్తవం. వెలమలు, దొరలు ఈ పదేళ్ల కాలంలో నయా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అంతా రావులదే హవా కొనసాగింది. దీనిని తీవ్రంగా తీసుకుంది మరో సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గం. తమ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి రూపంలో ఉండడంతో గంప గుత్తగా అన్ని పార్టీలలోని రెడ్లంతా ఇప్పుడు కాంగ్రెస్ రెడ్డి వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక 60 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిమ్న కులాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది వేచి చూడాలి.
Also Read : Telangana Dangal Comment : చతుర్ముఖ పోరులో చక్రం తిప్పేదెవరో