TGSRTC: మే 6 అర్ధరాత్రి నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె

మే 6 అర్ధరాత్రి నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె

 

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మ్రోగించడానికి సిద్ధపడుతున్నారు. మే 6 అర్ధరాత్రి నుండి సమ్మె చేయాలని జేఏసీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డ్స్‌లోని బస్ భవన్‌లో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌తోపాటు లేబర్ కమిషనర్‌ను కలిసి ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ నోటీసులు అందజేశారు. మే 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని… అంటే మే 7వ తేదీ నుండి డ్యూటీ నుండి సమ్మెకు వెళ్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వెంటనే నెరవేర్చాలి డిమాండ్ జేఏసీ చేసింది.

ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల నేతల చర్చలు విఫలం కావడం వల్లే మే 7వ తేదీ నుంచి సమ్మెకు పిలుపునిచ్చామని వారు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్బంగా వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ లాభాల బాటలో ఉందంటూ ఇప్పటి వరకు పీఆర్సీల ఊసే లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన ఆర్టీసీ కార్మికులకు ఇప్పటి వరకు వేతనాలు సైతం చెల్లించలేదని వారంతా వాపోయారు. అటు పీఆర్సీ లేదు… ఇటు జీతాలు సైతం లేవంటూ ప్రభుత్వంపై ఆర్టీసీ జేఏసీ నేతలు మండిపడ్డారు. ఇక ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నడిపించాలని సంస్థ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే 40 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆర్టీసీ జేఏసీ నేతలు గుర్తు చేశారు.

ఈ సమ్మె వ్యవహారంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు రెండు సార్లు వినతి పత్రం సమర్పించినా… వారి నుంచి కనీస స్పందన సైతం లేదని వారు తెలిపారు. ఇక లేబర్ జాయింట్ కమిషనర్ అయితే… ఎలక్షన్ కోడ్ అంటూ తమ మాటను దాటవేశారని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా ఓ కార్యక్రమం అయితే చాప కింది నీరులా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సంస్థ యాజమాన్యాన్ని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులంతా మే 7వ తేదీ నుంచి ఉధృతంగా సమ్మె బాట పట్లనున్నట్లు జేఏసీ నేతలు స్ఫష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!