Karl Marx : మహోన్నత మానవుడు మార్క్స్
మార్చి 14 లోకాన్ని వీడిన తత్వవేత్త
Karl Marx : ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహనీయుడు కార్ల్ మార్క్స్. జర్మన్ లో పుట్టాడు. జీవితమంతా అధ్యయనం చేస్తూనే గడిపాడు. ఓ వైపు బతికేందుకు ఇబ్బంది పడినా ఎక్కడా రాజీ పడలేదు. పిల్లల్ని, ప్రేమిచిన భార్యను కూడా కోల్పోయాడు. కానీ ఈ ప్రపంచానికి దిశా నిర్దేశం చేసే ఆయుధాన్ని అందించాడు కార్ల్ మార్క్స్(Karl Marx).
పేదరికం ఉన్నంత కాలం పెట్టుబడిదారి సమాజం కర్క్కశత్వంతో ఆధిపత్యం ఉన్నంత కాలం, మనుషుల మధ్య తారతమ్యాలు, ఆధిపత్య పోరాటాలు ఉన్నంత వరకూ ఈ లోకంలో సజీవంగా సంచరిస్తూనే ఉంటాడు కార్ల్ మార్క్స్ . బతికింది 64 ఏళ్లు అయినా నేటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. ఇదీ ఆయన ప్రత్యేకత.
19వ శతాబ్దంలో పేరు మోసిన తత్వవేత్తల్లో ఆయన ఒకరు. మతం మత్తు మందు అన్నాడు. ఆయన చెప్పిందే జరుగుతోంది భారత దేశంలో. పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని అవపోసన పట్టిన మేధావి. ఆయన రాసిన పెట్టుబడి లోకానికి ఓ దిక్సూచి.
కమ్యూనిజం, మార్క్సిజం, సామ్య వాదం, భౌతిక వాదం అన్నింటికీ మూలం కార్ల్ మార్క్స్. ఆయనకు రాజకీయం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం , కార్మిక సంబంధాలు , చరిత్ర, వర్గ పోరాటాలు ఇలా ప్రతి దాని పట్ల అభిరుచి కలిగి ఉన్నారు.
బ్రిటీష్ లైబ్రరీలోని పుస్తకాలను చదివాడు. తత్వవేత్తలు ప్రపంచం గురించి చెప్పారు. కానీ ఎలా మార్చాలో చెప్పలేదని ప్రకటించాడు కార్ల్ మార్క్స్.
ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన రాజకీయ ఆర్థిక శాస్త్రం, హెగెలియన్ తత్వ శాస్త్రం చదువుకున్నాడు. లండన్ లో గడిపాడు. ఫ్రెడరిక్ ఏంగెల్స్ తో కలిసి పుస్తకాలు రాశాడు. 1848లో కార్ల్ మార్క్స్(Karl Marx) రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అత్యంత ప్రసిద్దమైనది.
అది ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చాటి చెప్పాడు. అసలైన వాస్తవాన్ని బహిర్గతం చేశాడు.
పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప అన్నాడు మార్క్స్. ఆయన రాసిన పెట్టుబడి నేటికీ మార్గదర్శి. పోరాడే వాళ్లకు ఒక ఆలంబన. తన జీవితంలో చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతగా పేరు పొందారో అంతగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కార్ల్ మార్క్స్.
కోట్లాది మందికి ఆరాధ్య దైవం ఆయన. ఆధునిక సామాజిక శాస్త్ర నిర్మాతల్లో ఒకడిగా నేటికీ కొలవబడుతున్నాడు. ఆయన మరణాంతరం ప్రపంచాన్ని ఎక్కువగా ప్రభావితం చేశారు.
లెనిన్ , మావో, కాస్ట్రో, సాల్వడార్ అలెండి, జోసిప్ బ్రోజ్ టిటో , క్వామే క్రుమా లాంటి ఎందరో ప్రపంచ ప్రసిద్ది చెందిన నాయకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కవులు, కళాకారులు , గాయనీ గాయకులు, రచయితలు, రాజకీయ నేతలు , చిత్రకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను సైతం ముద్ర వేశారు కార్ల్ మార్క్స్. కోట్లాది మందికి ప్రాణ ప్రదమైన మహోన్నత మానవుడు మార్క్స్ లండన్ లో మార్చి 14, 1883లో తుది శ్వాస విడిచారు.
Also Read : కార్ల్ మార్క్స్ అక్షరాలు అక్షర సత్యాలు