Mahesh Kumar : అదానీ వ్యవహారంపై కేటీఆర్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన టీపీసీసీ చీఫ్
అదానీకి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇంచు భూమీ ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు...
Mahesh Kumar : దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అదానీ అంశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar) కౌంటర్ ఇచ్చారు. అలాగే ప్రధాని మోదీపైనా నిప్పులు చెరిగారు. స్కిల్ యూనివర్శిటీకి అదానీ నుంచి తెలంగాణ సర్కార్ రూ.100 కోట్లు తీసుకోవడం తప్పు కాదా అని కేటీఆర్ ప్రశ్నించడంపై మహేశ్ గౌడ్ స్పందించారు. స్కిల్ యూనివర్సిటీకి కేటీఆర్ విరాళం ఇచ్చినా తీసుకుంటామంటూ ఆయన చురకలు అంటించారు.
Mahesh Kumar Goud Comment
అదానీకి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇంచు భూమీ ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్(Mahesh Kumar) తెలిపారు. నేరం రుజువైతే అదానీతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. అదానీ అరెస్టయితే ప్రధాని మోదీ రాజీనామా తప్పదని టీపీసీసీ చీఫ్ జోస్యం చెప్పారు. అదానీ ఆర్థిక నేరంలో మోదీకీ భాగస్వామ్యం ఉందంటూ మహేశ్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. అదానీని వెంటనే అరెస్టు చేయాలని, లంచం అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ అరెస్టయితే అనేక అంశాలు బయటకి వస్తాయని చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వంలో ఆయన వేల కోట్ల లబ్ధి పొందారని, అదానీ ఆగడాలపై రాహుల్ ఎన్నిసార్లు ప్రశ్నించినా మోదీ కనీసం స్పందించలేదని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. అర్హత లేకున్నా అదానీ రుణాలు పొందారని, ఆయన వల్ల ప్రజలపై పెను భారం పడిందని ఆగ్రహించారు. అనేక దేశాలనూ అదానీ మోసం చేశారంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar) ధ్వజమెత్తారు.
కెన్యా దేశం మాదిరిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదానీతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అదానీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీలో ఒకలా తెలంగాణలో మరోలా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అదానీ అవినీతిపరుడు అయినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నీతిపరుడు ఎలా అవుతాడో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్కిల్ యూనివర్శిటీకి అదానీ నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ రూ.100 కోట్లు తీసుకోవడం తప్పు కాదా అంటూ ప్రశ్నించారు. కోహినూరు హోటల్లో మంత్రి పొంగులేటి, అదానీ రహస్య సమావేశం నిజం కాదా అంటూ ధ్వజమెత్తారు.అదానీతో దేశానికి నష్టమైతే తెలంగాణకు నష్టం కాదా అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే అదానీతో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఒప్పందాలు వెంటనే రద్దు చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహరాష్ట్ర వెళ్లి అదానీని గజదొంగ అని చెప్పిన రేవంత్.. తెలంగాణలో మాత్రం ఆయనకు గజమాల వేశారంటూ ధ్వజమెత్తారు.
Also Read : AP Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వాయిదాపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు