TTD Members Comment : టీటీడీ పాల‌క మండ‌లిపై పాలిటిక్స్

క‌స‌ర‌త్తు చేస్తున్న ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

TTD Members Comment : కోట్లాది మంది భ‌క్తుల కోర్కెలు తీర్చే దైవంగా భావించే తిరుమ‌ల ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌నీయాశంగా మారింది. కార‌ణం కోట్లాది రూపాయ‌లు, లెక్క‌కు మించిన ఆస్తులు, నిత్యం కానుక‌లు, ఆభ‌ర‌ణాలు టీటీడీకి(TTD) వ‌రంగా మారాయి. దీంతో పాల‌క మండ‌లి నియాకం హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం చైర్మ‌న్, స‌భ్యుల ప‌ద‌వీ కాలం పూర్త‌యింది. దీంతో ఎవ‌రిని నియ‌మిస్తార‌నే దానిపై చ‌ర్చోప చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

రాజ‌కీయాల‌కు నెల‌వుగా మార‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నాయి ధార్మిక సంస్థ‌లు. ఇక శ్రీవారికి గ‌ణనీయ‌మైన ఆదాయం స‌మ‌కూరుతున్నా భ‌క్తుల‌కు ఆశించిన మేర వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డంలో వైఫ‌ల్యం చెందింద‌న్న అపవాదు లేక పోలేదు. దేవుడు అంద‌రికి చెందిన వాడైతే ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించ‌డంలో వ‌ర్గాలుగా విభ‌జించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3, స‌ర్వ ద‌ర్శ‌నం , రూ. 300 టోకెన్లు, స్వామి వారికి నిత్యం పూజ‌లు చేసే స‌మ‌యంలో ల‌క్కీ డీప్ ప‌ద్ద‌తి ..ఇలా చెప్పుకుంటూ పోతే స‌వాల‌క్ష నిబంధ‌న‌లు ఉన్నాయి. రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, సీఎంలు, జ‌డ్జీలు, మంత్రులు, చైర్మ‌న్లు, వ్యాపార‌వేత్త‌లు, బ‌డా సంస్థ‌లు, సినీ న‌టులు వీళ్లంద‌రికీ బ్రేక్ ద‌ర్శ‌నాలు. ప్ర‌త్యేక సౌక‌ర్యాలు. దేవుడి ద‌గ్గ‌ర ప‌విత్రంగా భ‌క్తులు ఉండాల‌నేది నియమం. కానీ వాట‌న్నింటికీ తిలోద‌కాలు ఇచ్చింది పాల‌క మండ‌లి.

TTD Members Comment Viral

ఇటీవ‌ల ఓం రౌత్ ద‌ర్శ‌కుడు ఆది పురుష్ సినిమా తీశాడు. ఆయ‌న న‌టి కృతి స‌న‌న్ ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ముద్దు పెట్టుకున్నా ప‌ట్టించు కోలేద‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ప్ర‌త్యేకించి రాజ‌కీయ నాయ‌కుల‌కు టీటీడీ(TTD) అక్ష‌య పాత్రగా మారింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌తంలో కొంత క‌ట్టుదిట్టంగా ఉన్నా ప్ర‌స్తుతం భ‌క్తుల‌కు అందించే అన్న‌దానం, ల‌డ్డూ ప్ర‌సాదంలో నాణ్య‌త కొర‌వ‌డింద‌ని ఆవేద‌న చెందుతున్నారు. లెక్క‌లేనంత ఆదాయం స‌మ‌కూరుతున్నా ఆశించిన రీతిలో భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో అంత‌గా శ్ర‌ద్ద చూపించ‌క పోవ‌డానికి కార‌ణం రాజ‌కీయ‌, వ్యాపార ప‌ర‌మైన వ్య‌క్తులు పాల‌క మండ‌లిలో స‌భ్యులుగా ఉండ‌డ‌మేన‌ని ధార్మిక సంస్థ‌లు ఆవేద‌న చెందుతున్నాయి.

మ‌ఠాలు, పీఠాధిప‌తులు, స్వాములు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు ఇలా ఎవ‌రికి తోచిన రీతిలో వాళ్లు తిరుమ‌ల‌ను వాడేసుకుంటున్నారు. హిందూ ధ‌ర్మానికి , సంస్కృతికి ప్ర‌తీకగా తిరుమ‌ల ఉండాలి. కానీ ఇప్పుడు సిఫార‌సుల‌కు , పైర‌వీల‌కు కేరాఫ్ గా మారింది. ఇక రూ. 10 వేలు ఇస్తే నేరుగా ద‌ర్శ‌నం, ఎన్ని ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకుంటే అంత త్వ‌ర‌గా ప్ర‌యారిటీ . ఇది టీటీడీ పాల‌క మండ‌లి చేస్తూ వ‌స్తున్న నిత్య కృత్యం.

దేశానికి రాష్ట్ర‌ప‌తి అయినా రాష్ట్రానికి సీఎం అయినా సామాన్యుడితో పాటు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకునే లా చ‌ర్య‌లు తీసుకున్న‌ప్పుడే భ‌క్తులు ఆశించిన ప్ర‌యోజ‌నం నెర‌వేరుతుంది. ఇప్ప‌టికే టీటీడీ చైర్మ‌న్ బూమ‌న నియామ‌కంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి. టీటీడీ(TTD) రాజ‌కీయ పున‌రావాసంగా మారింద‌ని ఆవేద‌న చెందారు. ఇక కేబినెట్ లో చోటు ద‌క్క‌ని వారు, వ్యాపారాల పేరుతో మోసానికి పాల్ప‌డుతున్న వాళ్లకు పాల‌క మండ‌లిలో చోటు క‌ల్పిస్తే తిరుమ‌ల ప్ర‌భ త‌గ్గిపోతుంది. మ‌రి ఈసారైనా సీఎం జ‌గ‌న్ రెడ్డి స‌చ్చీల‌త‌, తిరుమ‌ల ప‌ట్ల నిబ‌ద్ద‌త క‌లిగిన వారిని పాల‌క మండ‌లిలో నియ‌మించాల‌ని, ప‌విత్ర పుణ్య క్షేత్రం పై ఉన్న నీలి నీడ‌ల‌ను తొలగించేలా చూస్తార‌ని భ‌క్తులు కోరుతున్నారు. మ‌రి ద‌య గ‌ల ప్ర‌భువు మ‌దిలో ఏం ఉంద‌నేది ఆ దేవ దేవుడికే తెలియాలి.

Also Read : Nara Lokesh 2500 KM : లోకేష్ 2,500 కిలోమీట‌ర్లు పూర్తి

Leave A Reply

Your Email Id will not be published!