Tummala Nageshwar Rao: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించండి – ప్రధానికి మంత్రి తుమ్మల లేఖ
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించండి - ప్రధానికి మంత్రి తుమ్మల లేఖ
Tummala Nageshwar Rao : చేనేత ఉత్పత్తులపై వెంటనే జీఎస్టీ తొలగించాలని కోరుతూ ప్రధాని మోదీకి తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwar Rao) లేఖ రాశారు. కేంద్ర హస్త కళలు, చేనేత మంత్రిత్వ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు కూడా ఆయన ఈ లేఖను పంపారు. రాష్ట్ర హస్తకళల పరిశ్రమకు ఊపిరిలాంటి చేనేత రంగం, చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీతో ప్రస్తుతం ఆ రంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోందని ప్రధాని, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఈ రంగం.. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులకు జీవనాధారమైందని పేర్కొన్నారు.
Tummala Nageshwar Rao Letter
‘‘అందం, నాణ్యత, సృజనాత్మకతకు అద్దం పట్టే పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, నారాయణపేట చీరలు, సిద్ధిపేట గొల్లభామ చీరలు, వరంగల్ దర్రీస్, కరీంనగర్ డబుల్ క్లాత్ చెద్దర్లు, ఇతర చేనేత వస్త్రాలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయి. వీటిలో ఆరు రకాల ఉత్పత్తులు జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 23,046 మంది చేనేత కార్మికులు, 34,569 మంది అనుబంధ కార్మికులు ఈ రంగంలో పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ముడి సరకుల ధరలు పెరగడం, పవర్‌లూమ్, మిల్ రంగాలు తక్కువ ఉత్పత్తి వ్యయంతో వస్త్రాలు తయారు చేయడంతో మార్కెట్లో చేనేత వస్త్రాలు తయారు చేసే నేత కార్మికులకు గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు 5 శాతం జీఎస్టీ విధించడం వల్ల చేనేత ఉత్పత్తుల ధరలు పెరిగి వినియోగం తగ్గిపోతుంది. కార్మికుల జీవనాధారం సంక్షోభంలో పడుతోంది.
జీఎస్టీ వల్ల నష్టపోతున్న నేతన్నలు తమ సంప్రదాయ వృత్తిని వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. సాధారణంగా ఖాదీ రంగం, చేనేత రంగం రెండూ సహజ సిద్ధమైన గ్రామీణ పరిశ్రమలుగా ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఖాదీ ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపు ఉండగా, చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ కొనసాగించడం అన్యాయం. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సంఘాలు, కార్మికులు ఈ పన్నును వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేనేత కార్మికుల ప్రయోజనాలు కాపాడటంతోపాటు నిరంతరం ఉపాధి కల్పించేందుకు భారతీయ చేనేత కళా వారసత్వం భావితరాలకు అందించడానికి చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ మినహాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి’’అని మంత్రి తుమ్మల (Tummala Nageshwar Rao) విజ్ఞప్తి చేశారు.
Also Read : INDIA Alliance: కేంద్ర ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి విమర్శలు
