Udhayanidhi Stalin: ఈడీ, మోడీలకు బెదిరేది లేదు – తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
ఈడీ, మోడీలకు బెదిరేది లేదు - తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
ప్రధాని మోడీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలను చూసి డీఎంకే భయపడదని ఉదయనిధి వ్యాఖ్యానించారు. తమపై పెట్టే కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటామని ఆయన తేల్చి చెప్పారు.
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… ‘రాష్ట్ర ప్రజల హక్కుల కోసం డీఎంకే పోరాటం కొనసాగిస్తుందని, ఎలాంటి బెదిరింపులకైనా భయపడబోదని చెప్పారు. తాత, మాజీ సీఎం కరుణా నిధి పెంచి పోషించిన డీఎంకే, హేతువాది పెరియార్ బోధించిన ఆత్మ గౌరవ నినాదానికి కట్టుబడిన పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. నిధి హక్కులు అడిగేందుకే ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లారన్నారు.
ఇదే సమయంలో ప్రతిపక్షనేత ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎవరో బెదిరిస్తే భయపడిపోయే పాలన తమది కాదన్నారు. తాము ఏ తప్పూ చేయలేదని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా చట్టపూర్వకంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఇండోర్ స్టేడియం పూర్తి చేయడానికి రూ.3.5 కోట్ల నిధులు కేటాయించారన్నారు. టాస్మాక్ పై ఈడీ దాడుల నేపథ్యంలో ఢిల్లీలో జరిగే నీతిఆయోగ్ సమావేశానికి వెళ్లేందుకు సీఎం స్టాలిన్ తొందరపడుతున్నారంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే చేసిన వ్యాఖ్యలపై పైవిధంగా స్పందించారు. గత కొంతకాలంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన, హిందీ భాష తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.