#VennelaKishore : సినీవాలిలో వెన్నెల వసంతం

క‌మెడియ‌న్ గా ఆక‌ట్టుకుంటున్న వెన్నెల కిషోర్

Vennela Kishore : తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. దాని రేంజ్ హాలీవుడ్ ను అందుకునే ప్రయత్నంలో ఉంది అంటే నమ్మగలమా. టాలీవుడ్ లో తీసే సినిమాల్లో కామెడీ అన్నది కంపల్సరీ. ప్రతి సినిమాలో హాస్యం అన్నది తప్పకుండా ఉండాలి. లేకపోతే తెలుగు వారు తట్టుకోలేరు. ప్రతి దర్శకుడు కొన్ని నిమిషాలైనా కామెడీ సీన్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.

ఇప్పటికే బ్రహ్మ్మనందం, ఆలీ , పృత్వి , తదితరులతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన వెన్నెల కిషోర్ తన హవాను కొనసాగిస్తున్నారు. మౌనంగా ఉంటూనే తన ప్రతిభా పాటవాలతో దుమ్ము రేపుతున్నారు. రోజు రోజుకు తాను లేకుండా సినిమాలు తీయలేని స్థితికి తీసుకు వచ్చారు ఈ నటుడు.

కిషోర్ ఉంటే చాలు సినిమా తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చంటున్నారు ఫ్యాన్స్. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి లో పుట్టిన ఇతగాడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కొంత కాలం పాటు పనిచేసారు. ఆ తర్వాత సినిమా మీదున్న ప్రేమ అతడిని దర్శకుడిగా మార్చేసింది. ఇంటర్ చదవడానికి హైదరాబాదుకు వచ్చాడు. సినిమాలు చూడటం అలవాటైంది.

డిగ్రీ పూర్తయిన తరువాత ఏడాదిన్నర పాటు ఓ కోర్సులో చేరాడు. జీఆర్ఈ, టోఫెల్ లో  మంచి స్కోరు సంపాదించాడు. అమెరికాలో మాస్టర్స్ చదవడానికి ఓ విశ్వవిద్యాలయంలో  సీటు కూడా దొరికింది.మాస్టర్స్ పూర్తవగానే వర్జీనియాలోని థామ్సన్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్‌వేర్ టెస్టర్ గా ఉద్యోగం దొరికింది.

అక్కడ ఉన్నప్పుడే వెన్నెల సినిమాకు దర్శకుడు దేవ కట్టా దగ్గర సహాయకుడిగా పని చేయడానికి వెళ్ళాడు. ఆ సినిమాలో ఖాదర్ పాత్రలో నటించాల్సిన శివారెడ్డి వీసా కుదరక పోవడంతో ఆ పాత్రలో కిశోర్ (Vennela Kishore)నటించాల్సి వచ్చింది. అలా మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు.

వర్జీనియాలో ఎన్నారైలకు నెల జీతంతో కూడిన సెలవు ఇచ్చేవారు. ఆ సెలవును వాడుకుని ఈ సినిమాకు పనిచేశాడు. తరువాత చిరంజీవి నటించిన సినిమా  స్టాలిన్ లో  అవకాశం వచ్చినా సెలవు దొరక్క అందులోంచి తప్పుకున్నాడు.వెన్నెల సినిమా విడుదలయ్యాక మూడేళ్ళు సినిమా ఊసే ఎత్తలేదు.

అప్పుడే పెళ్ళి కూడా చేసుకున్నాడు. భార్య పద్మజ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. కిశోర్ అమ్మ సలహా మేరకు ఇద్దరూ భారత్ కు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పులన్నీ తీర్చుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చేసారు. కిశోర్ ముంబైలోని జెపి మోర్గాన్ లో, భార్య పద్మజకు హైదరాబాదులో మంచి ఉద్యాగాలు దొరికాయి.

ఇక్కడికి రాగానే మరిన్ని అవకాశాలు తలుపు తట్టడంతో జెపి మోర్గాన్ లో చేరడానికి,  మరో ఆరు నెలలు గడువు తీసుకుని పూర్తి స్థాయి నటుడిగా మారి పోయాడు. వెన్నెల , ఇందుమతి , కరెంట్ , బిందాస్ , ప్రస్థానం , స్నేహ గీతం , ఆరెంజ్ , ఏమైంది ఈవేళ , ఆహా నా పెళ్ళంటా , లవ్ గురు , సీమ టపాకాయ్ సినిమాలో న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు.

దూకుడు , మడత కాజా , పిల్ల జమిందార్ , మిస్టర్ నూకయ్య, లవ్లీ , దరువు, జులాయి , అలా ఎలా , నాన్నకు ప్రేమతో , మనమంతా , జనతా గ్యారేజ్ , సుప్రీం , చలో  తదితర సినిమాల్లో నటించాడు . అంతకంటే ఎక్కువగా పాపులర్ అయ్యాడు దూకుడు లోని శాస్త్రి , మన్మధుడు -2 సినిమాలో కిశోర పాత్రలు. మొత్తం మీద తెలంగాణాకు వెన్నెల కిషోర్(Vennela Kishore) పేరు తీసుకు వచ్చాడు .

No comment allowed please